రియ‌ల్ ఎస్టేట్ సంస్థల్లా ఆసుప‌త్రులు.. సుప్రీం నిప్పులు

Update: 2021-07-19 16:30 GMT
''ఆసుప‌త్రుల‌ను మానవసేవా దృక్ప‌థంతో చూస్తున్నామా? రియ‌ల్ ఎస్టేట్ ప‌రిశ్ర‌మ‌లుగా చూస్తున్నామా?'' అని దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ఆసుపత్రులు మానవ విపత్తులను అడ్డుపెట్టుకొని భారీ పరిశ్రమలుగా మారుతున్నాయని, ప్రజల ప్రాణాలను అడ్డం పెట్టుకొని సంపద పోగు చేసుకుందామంటే దానికి తాము అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఒక సుమోటో కేసుపై విచార‌ణ సంద‌ర్భంగా అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

స్థిరాస్తి వ్యాపారంగా మారిన ఆసుప‌త్రుల‌ను మూసేస్తే మంచిద‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇలాంటి ద‌వాఖాన‌ల‌ను మూసేసి, హెల్త్ కేర్ స‌దుపాయాల‌ను మెరుగు ప‌రుచుకునేందుకు రాష్ట్రాల‌కు అనుమ‌తిస్తే మంచిద‌ని సూచించింది. అనేక ద‌వాఖానాల్లో క‌నీస ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించ‌ట్లేద‌ని కోర్టు మండిప‌డింది.

ఈ సంద‌ర్భంగా ఓ దుర్ఘ‌ట‌న‌ను ఉద‌హ‌రించింది సుప్రీం న్యాయ‌స్థానం. ఒక ఆసుప‌త్రిలో కొవిడ్ నుంచి కోలుకుని, మ‌ర్నాడు డిశ్చార్జి కావాల్సిన ఒక పేషెంట్‌.. అదే ఆసుప‌త్రిలో సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదంలో స‌జీవ‌ద‌హ‌నం అయ్యాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇదే ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు న‌ర్సులు కూడా ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న క‌ళ్లు ముందే జ‌రుగుతున్నాయ‌న్న సుప్రీం.. ఈ ఆసుప‌త్రులు ఉన్న‌ది రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌డానికా? మానవాళికి సేవలు అందించడానికా? అని సూటిగా నిల‌దీశారు.

ఇక‌, ఇదేవిష‌య‌మై గుజ‌రాత్ ప్ర‌భుత్వాన్ని కూడా సుప్రీం కోర్టు తీవ్రంగా మంద‌లించింది. ఆసుప‌త్రుల్లో భ‌ద్ర‌త‌పై క‌మిష‌న్ స‌మ‌ర్పించిన నివేదిక సీల్డ్‌క‌వ‌ర్ లో ఉండ‌డంపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సీల్డ్ క‌వ‌ర్ లో ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించింది. ఇదేమైనా న్యూక్లియ‌ర్ సీక్రెట్ కాదు క‌దా? అని వ్యాఖ్‌యానించింది. ఈ ఏడాది డిసెంబ‌ర్ లో ఆసుప‌త్రుల‌కు సంబంధించిన స‌మ‌గ్ర ఆడిట్ నివేద‌క‌ను కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని గుజ‌రాత్ స‌ర్కారును ఆదేశించింది.
Tags:    

Similar News