ట్రంప్ ఓడినట్టా.. గెలిచినట్టా..? ఇరాన్ పాఠం!
ఇరాన్ పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గెలిచినట్టా? ఓడినట్టా? అన్న చర్చ ఆసక్తి రేపుతోంది.;
ఇరాన్ పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గెలిచినట్టా? ఓడినట్టా? అన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ఇరాన్ పై ట్రంప్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరకుండానే తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ తాత్కాలిక విరామం ఏకంగా యుద్ధం ముగియడానికి దారి తీస్తుందని అంటున్నారు. దీంతో యుద్ధంతో ట్రంప్ ఏం సాధించారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తన రెండో విడత పాలనలో ప్రపంచ గమనాన్ని శాసించాలనుకున్నా, ఇరాన్ విషయంలో ఆయన ఆశలు ఆవిరి అయ్యాయని, యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక అయోమయంలో ఉన్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, ఇరాన్‌లో పాలన మార్పు అన్న లక్ష్యాలతో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా గత నెల 28న ఇరాన్ పై దాడులు ప్రారంభించారు. తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అమెరికా అంతం చేసింది. ఆ తర్వాత రెండు వారాల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్ మహమ్మద్ పాక్‌పూర్, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మూసవి, రక్షణ మంత్రి అజీజ్ నజీర్ జాదే, సుప్రీం లీడర్ సలహాదారు అలీ షంఖానీ వంటి వారిని అమెరికా మట్టుపెట్టింది.
సుప్రీం లీడర్ తోపాటు కీలకమైన సైనిక కమాండర్లు ఒకేసారి పోగొట్టుకుని ఇరాన్ కొంత అయోమయంలో పడినా, ఇరాన్ ప్రతిఘటన కూడా అంతేస్థాయిలో చూపింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ప్రయోగించడం, హోర్ముజ్ జలసంధిని నియంత్రణలోకి తీసుకోవడం, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసి తాము తక్కువేం కాదని నిరూపించింది. ఈ క్రమంలో ఇరాన్ ను సర్వనాశనం చేస్తానని, 48 గంటల్లో లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
అయితే ఇరాన్ మాత్రం ఎక్కడా వెన్ను చూపలేదు. యుద్ధంలో ఇరాన్ సైనిక పరంగా, ఆర్థికంగా సామాజికంగా భారీ నష్టాన్ని చవిచూసినా ప్రతిదాడులు చేయడంతో అమెరికా ఆలోచనలో పడిందని అంటున్నారు. మరోవైపు యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కావడంతో యుద్ధ విరమణపై అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. దీంతో యుద్ధం నుంచి ఎలాగోలా బయట పడాలనే తాపత్రయంతో ట్రంప్ దారులు వెతికారని, ఎడారిలో ఓయాసిస్సులా తుర్కియే, ఒమన్ మధ్యవర్తిత్వంతో రహస్య చర్చలు జరిపి ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ట్రంప్ బెదిరింపులను ఉత్తుత్తి ఘాండ్రింపులుగా అభివర్ణించిన ఇరాన్ తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ యుద్ధంలో ట్రంప్ కు క్రెడిట్ దక్కనీయకుండా చూస్తోందని అంటున్నారు. భయపెట్టి ఇరాన్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్న ట్రంప్ ప్రయత్నాలు సఫలం కావని ఆ దేశం తేల్చిచెప్పడం ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. మరోవైపు అమెరికా లక్ష్యాలు దాదాపు నెరవేరాయని, అందుకే యుద్ధాన్ని ముగించే దిశగా ఆలోచిస్తున్నామని ట్రంప్ చెబుతుండటం యుద్ధంపై ఆయన అయోమయ స్థితికి వెళ్లిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు.