తల్లి అంత్యక్రియలను అడ్డుకున్న కొడుకు ..ఎందుకంటే ?

Update: 2020-12-17 05:06 GMT
కన్నకొడుకే కాల యముడై కర్కశంగా మారి తల్లి అంత్యక్రియలని అడ్డుకున్నాడు. తల్లి పేరు మీద ఉన్న భూమిని రాసిచ్చే వరకు తలకొరివి పెట్టే ప్రసక్తే లేదని కసాయి వాడిలా కూర్చున్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి జీల్గుల గ్రామంలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి జీల్గుల  గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి సారయ్య రాజమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే సారయ్యతో పాటు పెద్ద కుమారుడు సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం రెండో కుమారుడు జంపయ్య, చిన్న కుమారుడు రవీందర్‌ ఉన్నారు. వీరికి గతంలోనే ఆస్తుల పంపకాలు పూర్తి కాగా, తల్లి రాజమ్మ పేరిట ఎకరన్నర భూమి ఉంది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజమ్మ... బుధవారం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియల విషయంలో అన్నాదమ్ముళ్లు గొడవపడ్డారు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన చిన్నకుమారుడు రవీందర్ రచ్చ చేశాడు. తల్లి పేరిట ఉన్న భూమి తనదేనని.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని గొడవపెట్టుకున్నాడు. బంధువులు, గ్రామస్తులు నచ్చజెప్పినా వినలేదు. అసలు ఇక్కడ ఖననం చేయవద్దని వాగ్వాదానికి దిగాడు. చివరకు పోలీసులు చేరుకొని రవీందర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం రాజమ్మ అంత్యక్రియలను ఆమె పేరిట ఉన్న భూమిలోనే నిర్వహించారు. అంత్యక్రియలు చేసేందుకు రవీందర్ ముందుకు రాకపోవడంతో రెండు కుమారుడు జంపయ్య తల కొరివి పెట్టాడు.
Tags:    

Similar News