అమ్మతో బంగారాన్ని మరిచిన తెలుగు ఛానళ్లు

Update: 2016-12-07 06:57 GMT
ఈ మధ్యన ఐటీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా జరిగే అనర్థం కంటే కూడా కొన్నిప్రముఖ తెలుగు ఛానళ్ల కారణంగా తెలుగు లోగిళ్లు మొత్తం గోల్డ్ గోలతో హోరెత్తిపోయాయి. ఇళ్లల్లో ఉండే బంగారంపై మోడీ సర్కారు కన్ను పడిందన్నఆందోళన జనాలతో పాటు.. ఛానళ్లు కూడా గోల్డ్ గళం విప్పటంతో.. పలు ప్రముఖ ఛానళ్లు మొత్తం బంగారం మీద ఆగమాగమైపోయాయి.

ఈ పరిస్థితి ఒకట్రెండు రోజులో కాకుండా.. రోజుల తరబడి అదే పనిగా సాగింది. గోల్డ్ మీద వివరణ ఇచ్చేందుకు బీజేపీ నేతలు సాహసించకపోవటం.. రెండు తెలుగు రాష్ట్రాల అధికారపక్షాలు పెద్దగా చొరవను ప్రదర్శించకపోవటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కొంతమంది ప్రముఖులు.. విశ్లేషకులు.. బంగారం మీద జనాల్లో ఉన్న భయాందోళనల్ని ఖండించే ప్రయత్నం చేసినప్పుడు.. ఛానల్ ప్రతినిధులు అడ్డదిడ్డంగా వేసే ప్రశ్నలతో.. మనకెందుకీ గోల అన్నట్లుగా కొందరు మేధావులు మౌనంగా ఉండటం కనిపించింది.

ఇలా.. గోల్డ్ మీద సాగిన గోలపై కాస్త ఆలస్యంగా స్పందించారు తెలుగు ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ప్రజల ఇళ్లల్లో ఉండే బంగారం మీద తమ ప్రభుత్వం గురి పెట్టటం లేదని..అలా జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన పదే పదే చెప్పినా.. ఎవరూ పట్టించుకోని పరిస్థితి. బంగారం మీద నాన్ స్టాప్ గా సాగుతున్న లైవ్ లకు అమ్మ బ్రేక్ వేశారని చెప్పాలి.

ఆదివారం సాయంత్రం నుంచి ఏ న్యూస్ ఛానల్ చూసినా.. అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందన్న మాటే ప్రముఖం కావటంతో.. అప్పటివరకూ గోల్డ్ కు తెగ ప్రాధాన్యత ఇచ్చిన ఛానళ్లు.. వెంటనే తమ టోన్ మార్చేసుకున్నాయి. నాన్ స్టాప్ గా సాగిన అమ్మ ఎపిసోడ్ సోమవారం రాత్రికి ఒక క్లారిటీ రావటం.. అర్థరాత్రికి కాస్త ముందుగా అమ్మ మరణ వార్తను అధికారికంగా డిక్లేర్ చేయటంతో.. ఆమెకు సంబంధించిన వార్తలతో.. ప్రత్యేక కథనాలతో ఛానళ్లు హోరెత్తించాయి. గోల్డ్ తప్ప మరింకేమీ కనిపించని చానళ్ల వైఖరికి అమ్మ మరణంతో చెక్ పడినట్లైంది. మొత్తంగా బంగారంపై సాగిన భారీ చర్చకు అమ్మ కారణంగా బ్రేక్ పడిందని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News