జగన్ సొంతూళ్లో టీడీపీ జెండా ఎగురుతుందా?

Update: 2016-04-28 11:54 GMT
పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలం బలపనూరు.. అక్కడ గ్రామ పంచాయతీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఒక చిన్న ఊళ్లో ఉప ఎన్నిక జరిగితే ఆ ఊళ్లో మాత్రమే హడావుడి ఉంటుంది.. కానీ, బలపనూరు ఉప ఎన్నికపై రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం ఒకటే.. అది దివంగత సీఎం రాజశేఖరరెడ్డి స్వగ్రామం. అందుకే అక్కడి ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  2200 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇప్పడు అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. 

ఇక్కడ ఈ సమస్య ఉందని ప్రజలు చెప్పడమే తరువాయి పార్టీల నేతలు దగ్గరుండి మరీ పరిష్కారమయ్యేలా  చూస్తున్నారు. విపక్ష నేత జగన్ పుట్టిల్లయిన బలపనూరు ఇప్పుడు పార్టీలన్నిటికీ ప్రధాన లక్ష్యమైపోయింది. అక్కడ సర్పంచి పదవిని గెలుచుకుని జగన్ సొంతూళ్లో పాగా వేశామని అనిపించుకోవాలని టీడీపీ తహతహలాడుతోంది. అదేసమయంలో ఆ అవకాశం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వరాదని వైసీపీ అనుకుంటోంది.

బలపనూరులో మొదటినుంచి  వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన వ్యక్తే ఆ గ్రామానికి సర్పంచ్ గా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ... ఇప్పటిదాకా అసలు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోకే దిగలేదు. వైఎస్ మరణం తరువాత కూడా 2013లో జగన్ కుటుంబం మద్దతు పలికిన సరస్వతమ్మ విజయం సాధించారు. అయితే ఆమె ఇటీవలే చనిపోయారు. ఈ క్రమంలో వైఎస్ సొంతూళ్లో పసుపు రంగు జెండా ఎగురవేయాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జగన్ కు కాస్తంత ఇబ్బందికరంగా పరిణమించాయి. ఈ సమయమే వైఎస్ సొంతూళ్లో పాగా వేసేందుకు సరైన సమయమని టీడీపీ భావిస్తోంది.

కాగా అసలే ఎమ్మెల్యేలను కోల్పోతున్న సమయంలో సొంతూళ్లో సర్పంచి పదవి కూడా తమకు దక్కకపోతే అది తీరని అవమానం అవుతుందని జగన్ అనుకుంటున్నారు.  ఈ క్రమంలో గ్రామ ప్రజలు అడగకుండానే టీడీపీ - వైసీపీ రెండూ కూడా   అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. గ్రామం చుట్టూ ఉన్న ముళ్ల కంపలను తొలగిస్తున్నాయి. రజకులు అడగకున్నా... వారి ఇళ్ల వద్దకు ఇస్త్రీ పెట్టెలు వచ్చి వాలుతున్నాయి.  ఇళ్ల వద్ద చిన్నచిన్న రోడ్లు వేసుకోవాలన్నా, మట్టి నింపుకోవాలన్నా కూడా పార్టీలే తెచ్చి వేస్తున్నాయట. ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉందో గుర్తించి మరీ భారీ ఖర్చుతో అక్కడ పనులు చేస్తున్నారు. ఇంత చేస్తున్నాక జగన్ తన బలం, ఉనికి కాపాడుకుంటారో లేదంటే... ఇక్కడ కూడా టీడీపీ జగన్ ను దెబ్బతీస్తుందో చూడాలి.
Tags:    

Similar News