క‌దిరిలో టీడీపీ స్వ‌యంకృతాప‌రాధం!

Update: 2018-07-27 17:52 GMT
గత ఎన్నికలలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంఎల్ ఏలను చంద్రబాబు తమ సైకిల్ పుష్పక విమానమని - పసుపు కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే అదే ఇప్పుడు సమస్యగా మారుతోంది. ఈ రాకపోకల కారణంగా రాబోయే ఎన్నికలలో సీట్లు కేటాయించడం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీట్ల కేటాయింపు దగ్గరకి వచ్చేసరికి తమకంటే తమకంటూ ఇటు మాజీ ఎంఎల్ ఏలు -సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అనంతపురం జిల్లా కదరి నియోజకవర్గంలో  గ్రూప్ తగాదాలు చంద్రబాబు నాయుడుకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 2014 ఎన్నికలలో వైఎస్‌ ఆర్‌ సీపీ ఓటు బ్యాంకుతో గెలిచిన చాంద్ భాషా - తన పార్టీ ఓటమి పాలవడంతో సైకిలెక్కారు.

కదిరి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. అటు మాజీ ఎంఎల్ ఎ కందిగొండ వెంకట ప్రసాద్ తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తాను ఓడిపోయినప్పటికీ కదిరి ప్రజలకు మాత్రం దూరమవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం టిక్కెట్టు తమకంటే తమకంటూ ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే, అటు మాజీ ఎమ్మెల్యల వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. తాను పార్టీ మారిందే 2019 తెలుగుదేశం టికెట్టు ఇస్తానన్న హామీతోనే అని చాంద్ భాషా అంటున్నారు. కదిరి నియోజక టికెట్టు విషయంలో రాజీ పడేది లేదని ఇద్దరు నాయకులు తెగేసి చెప్పడంతో చంద్రబాబుకు ఎవరిని బుజ్జగించాలో అర్ధం కావటం లేదని అంటున్నారు. ఈ గ్రూప్ తగాదాల వల్ల ఓట్లు చీలిపోయి వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ కు మేలు చేకూరే ప్రమాదముందని ఆ పార్టీ వర్గాలు భ‌య‌ప‌డుతున్నాయి.  

ఇంతకు ముందు కదిరి నుంచి భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అక్కడ ఆ పార్టీకి చెందిన పార్థసారధి గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయనకు కదిరిలో సొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓట్లు గతంలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. అయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది. ఈ సారి బిజెపి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బదిలి అయ్యే అవకాశాలున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నానాటికీ పెరుగుతున్న విబేధాలు ఆ పార్టీ ఓటమిని శాసిస్తాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో కదిరిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు చూస్తే గొయ్యి... వెనుక చూస్తే నుయ్యి అన్నట్లుగా ఉంది.
Tags:    

Similar News