చిట్టీల పేరుతో రూ.7 కోట్లు వసూలు చేసిన టీడీపీ నేత జంప్

Update: 2021-12-05 04:37 GMT
ఎన్ని మోసాలు జరిగినా.. ఎంత మంది మోసపోయినప్పటికీ.. ఇప్పటికి చిన్న ఊరు మొదలుకొని.. మహానగరాల వరకు అనధికారికంగా సాగే చిట్టీల వ్యాపారం అంతా ఇంతా కాదు. సాగినంత కాలం బాగానే సాగినా.. కొంప ముంచే కొందరి కారణంగా అవస్థలు పడే వారెందరో. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన నేత ఒకరు రూ.7కోట్లతో పరారైన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ అతడెవరు? టీడీపీలో అతడి స్థాయి ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడుకు చెందిన ఉప సర్పంచ్ కమ్ టీడీపీ నేత తిరుమళ్ల రంజిత్ కుమార్.. ఎన్నో ఏళ్లుగా చిట్టీల వ్యాపారాన్ని చేస్తుండేవారు. ఓవైపు చిట్టీలు.. మరోవైపు ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. ఎంతో కాలంగా అనధికారింగా నిర్వహించే అతగాడి చిట్టీల వ్యాపారం మీద ఉన్న నమ్మకంతో చాలామంది తమ పొదుపు మొత్తాల్ని అతడి వద్ద దాచారు. దాదాపు రూ.7 కోట్ల ప్రజల సొమ్మును తీసుకున్న అతడు తాజాగా కనిపించకుండా పోయాడు.

అతడి ఇంటికి వెళితే తాళం వేసి ఉండటం.. సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. వారం రోజులుగా కనిపించకుండా పోయిన అతగాడు.. వందలాది మంది ఆశల్ని తుంచేసి.. వారి సొమ్ముతో పరారైనట్లుగా చెబుతున్నారు. దీంతో.. వారంతా కలిసి పోలీసుల్ని ఆశ్రయించారు. రాజకీయంగా పేరున్న అతను.. ప్రజలను ఈ తీరులో మోసం చేయటం ఏమిటన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. పిల్లల పెళ్లి కోసం.. ఉన్నత చదువుల కోసం.. ఇలా ఎన్నో కారణాలతో పొదుపు చేసుకున్న వారంతా ఇప్పుడు లబోదిబో అంటున్న పరిస్థితి.
Tags:    

Similar News