30 కాదు.. తగ్గించేసిన టీడీపీ..కాంగ్రెస్ హ్యాపీ

Update: 2018-09-21 11:04 GMT
తెలంగాణ తెలుగు దేశం పార్టీ తన పంథాను మార్చుకున్నట్టు వార్తలొస్తున్నాయి. మహాకూటమిలో ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరదించడానికి.. సీట్ల సర్దుబాటు కావడానికి టీడీపీ నేతలు పెద్ద స్కెచ్ గీసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 30 నుంచి 35 సీట్ల వరకూ డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు కేవలం గెలిచే సీట్లను మాత్రమే తనకు ఇవ్వాలని కాంగ్రెస్ ముందు ప్రతిపాదన పెట్టబోతున్నదని సమాచారం. ఇందుకోసం పక్కాగా ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది..

టీడీపీ ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉంది. 30 సీట్లు అడిగినా కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదు. పదుల సంఖ్యలో సీట్లు తీసుకొని ఓడిపోయే కంటే బలమున్న చోట - గెలిచే సీట్లలోనే పోటీచేస్తే పార్టీకి - మహాకూటమికి బలమని భావిస్తోంది. అందుకే టీడీపీలో ఉన్న బలమైన నేతలు - వారు కోరుకునే సీట్లను మాత్రమే అడగాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇందులో భాగంగా హైదరాబాద్ లో రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే అడగాలని డిసైడ్ అయ్యిందట.. కూకట్ పల్లి - ఉప్పల్ నియోజకవర్గాలు పక్కాగా కావాలని కోరడంతోపాటు జూబ్లిహిల్స్ లేదా శేర్ లింగపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒకటి కావాలని ప్రతిపాదన పెట్టబోతోందట..

ఇక తెలంగాణ వ్యాప్తంగా మక్తల్ నుంచి టీడీపీ సీనియర్ నేత దయాకర్ రెడ్డి - నర్సంపేట నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి - కోదాడ నుంచి మల్లయ్య యాదవ్ - సత్తుపల్లి నుంచి సండ్రవెంకట వీరయ్యలకు టికెట్ ఇప్పించాలని ప్రతిపాదన చేయబోతున్నారట.. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా ఉండడం.. గెలిచే అవకాశాలుండడంతో ఈ సీట్లనే అడగాలని టీడీపీ డిసైడ్ అయినట్టు తెలిసింది. ఇలా గెలిచే సీట్లలోనే పోటీచేసి టీఆర్ ఎస్ ను ఓడించాలని టీడీపీ వేసిన ఈ ప్లాన్ కు కాంగ్రెస్ నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. ఇలానే ముందుకెళితే గులాబీ పార్టీని ఓడించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట..
Tags:    

Similar News