చర్చలు విఫలం.. కారణమిదే.. సమ్మెలోనే ఆర్టీసీ

Update: 2019-10-27 05:17 GMT
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 23వ రోజులోకి చేరుకుంది. హైకోర్టు సోమవారం ఈనెల 28 లోగా కార్మికులతో చర్చలు జరిపి నివేదికను  సమర్పించాలని ఆదేశించడంతో సీఎం కేసీఆర్ దిగివచ్చారు. ఆర్టీసీ కార్మికులతో శనివారం అంతా చర్చలు జరిపించారు. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి.

తెలంగాణ ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపిన తరువాత సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు పేర్కొన్నారు. మరో రౌండ్ చర్చలకు ఆహ్వానిస్తే వస్తామని ట్విస్ట్ ఇచ్చారు.

చర్చలు విఫలం కావడానికి గల కారణాలను చర్చల్లో పాల్గొన్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆంక్షల మధ్య సమావేశం నిర్వహించారని.. తమ ఫోన్లు లాక్కున్నారని.. ఆర్టీసీ చరిత్రలో ఇన్నేళ్లలో తాను ఇలాంటి సమావేశం చూడలేదని మండిపడ్డారు.  26 డిమాండ్లపై చర్చిద్దామంటే 21 డిమాండ్లపై చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో తాము చర్చల నుంచి వైదొలిగామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. జేఏసీతో మాట్లాడి మళ్లీ పిలిస్తే చర్చలకు వస్తామని చెప్పామని తెలిపారు.

ఇక జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావ్ మాట్లాడుతూ ఇలాంటి వాతావరణం శత్రు దేశాలతో కూడా చర్చలు జరిపే చోట ఉండదంటూ ధ్వజమెత్తారు. ఇక మరో కోకన్వీనర్ మాట్లాడుతూ వారు కోర్టు చెప్పిన కారణంగానే తూతూ మంత్రంగా చర్చలు జరిపారని ధ్వజమెత్తారు.

ఇక ఈ సమ్మెపై హైకోర్టు ఆదేశాల మేరకు చర్చలు జరిగాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. జేఏసీ నాయకులు  ఇతర నాయకులతో సంప్రదించిన తరువాత తిరిగి వస్తారని చెప్పి మళ్లీ రాలేదని తెలిపారు.

ఇక విలీనం మినహా 21 డిమాండ్లకే ప్రభుత్వం చర్చల్లో అవకాశం ఇచ్చింది. కానీ కార్మిక సంఘాలు మాత్రం విలీనంతో సహా 26 డిమాండ్లపై చర్చించాలన్నారు. దీంతో సమావేశంలో చర్చలు జరగకుండానే ముగిసిపోయింది. కేవలం హైకోర్టు ఆదేశాల మేరకు చర్చలపై కోర్టులో సమర్పించే నివేదిక కోసమే ప్రభుత్వం ఇలా  నాటకమాడిందని కార్మిక నేతలు ధ్వజమెత్తారు.
Tags:    

Similar News