వైసీపీలోనే కాదు.. టీడీపీలోనూ ఉండ‌వ‌ల్లి శ్రీదేవిలు!

Update: 2020-09-14 10:50 GMT
తాజాగా మ‌రోసారి రాజ‌కీయ విమ‌ర్శ‌ల సుడిలో చిక్కుకున్నారు గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే, తొలిసారి గెలుపుగుర్రం ఎక్కిన డాక్ట‌రమ్మ‌.. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి. ఇటీవ‌ల కాలంలో ఆమె వివాదాల‌కు కేంద్ర బిందువుగా ఉన్న విష‌యం తెలిసిందే. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో స్థానిక ఎమ్మెల్యే అయిన శ్రీదేవి.. అనేక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. ఇక్క‌డి రైతుల నుంచి తీవ్ర ఆగ్ర‌హం చ‌వి చూశారు. పార్టీలో మెప్పుకోస‌మో.. లేదా.. తాను ఎమ్మెల్యే అనే భావ‌మో.. తెలియ‌దు కానీ, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి దూకుడు మాత్రం కొన‌సాగుతోంది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆమెపై మ‌రో విమ‌ర్శ చెల‌రేగింది.

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో స్థానిక వైసీపీ నాయ‌కుడు మేక‌ల ర‌వి నుంచి ఉండ‌వ‌ల్లి శ్రీదేవి కొంత మొత్తం అప్పుగా తీసుకున్నార‌ని,  దీనిలో రూ.40 ల‌క్ష‌లు తిరిగి ఇచ్చార‌ని, మిగిలిన మొత్తం ఇవ్వ‌కుండా.. ఇబ్బంది పెడుతున్నార‌నేది ర‌వి వాదన‌. అంతేకాదు, స‌ద‌రు మొత్తం అడిగితే.. జైల్లో వేయిస్తాన‌ని శ్రీదేవి బెదిరిస్తున్నార‌ని కూడా ర‌వి త‌న సెల్ఫీ వీడియోలో చేసిన విమ‌ర్శ‌లు వైసీపీలో కాక‌రేపింది. స‌రే! ఈ విష‌యంలో నిజం ఏంట‌నేది ప‌క్క‌న పెడితే.. అస‌లు ఇలాంటి విష‌యం ఏదో తొలిసారి మాత్ర‌మే తెర‌మీదికి వ‌చ్చిందా?  ఉండ‌వ‌ల్లి శ్రీదేవి మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ నేత‌ల నుంచి డ‌బ్బులు తీసుకున్నారా? అంటే.. కాద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది ప‌రిశీల‌కుల నుంచి.

ఆ పార్టీ ఈపార్టీ అనే తేడా లేకుండా.. టీడీపీ నుంచి జ‌న‌సేన వ‌ర‌కు, ఆఖ‌రుకు క‌మ్యూనిస్టుల‌కు కూడా ఎన్నిక‌ల స‌మయంలో డ‌బ్బులు తీసుకోవ‌డం అనేది స‌హ‌జ ప్ర‌క్రియే. అంటే.. ఉండ‌వ‌ల్లి శ్రీదేవిల వంటివారు చాలా మంది ఉన్నారనేది వాస్త‌వం. పార్టీల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు డ‌బ్బుల వినియోగం మంచి నీళ్ల ప్రాయంగా ఉన్న నేప‌థ్యంలో అప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బులు స‌ర్దేవారు దేవుళ్ల‌తో స‌మానం. కాబ‌ట్టి కేవ‌లం ఇలాంటి విమ‌ర్శ‌లు ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి మాత్ర‌మే ప‌రిమితం కాదు. అయితే, ఆయా విష‌యాల్లో నాయ‌కులు పార్టీలు కూడా సైలెంట్‌ గా ఉంటాయి. ఏదైనా ఇచ్చి పుచ్చుకునే విష‌యాలు ఉంటే.. నాలుగు గోడ‌ల మ‌ధ్య చూసుకుంటారు.

ఎప్పుడైనా ఏదైనా ఘ‌ర్ష‌ణ వ‌చ్చినా.. పార్ట‌లో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటారు. చెల్లింపులు చేయ‌డ‌మో.. లేదా మ‌రో రూపంలో ల‌బ్ధి చేకూర్చ‌డ‌మో చేస్తారు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అనేక మంది వ్యాపార వేత్త‌లు ఆయ‌న‌కు, పార్టీకి కూడా నిధులు అందించార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అధికారంలోకి రాగానే వారికి అనేక మేళ్లు చేకూర్చార‌ని అంటారు. అయితే, ఈ క్ర‌మంలో వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. రాజ‌కీయాల‌కు కొత్త కావ‌డం, అన్ని విష‌యాల్లోనూ మాదే పైచేయిగా ఉండాల‌ని అనుకోవ‌డం వంటి ప‌రిణామాలే.. ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి శాపంగామారింద‌ని చెబుతున్నారు. ఇలాంటి వారు ఇప్ప‌టికైనా దూకుడు త‌గ్గిస్తే మంచిద‌ని ప‌రిశీల‌కులు హిత‌వు ప‌లుకుతున్నారు.
Tags:    

Similar News