వ్యాక్సినేషన్ పాలసీ: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Update: 2021-06-02 15:31 GMT
కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ పాలసీపై సుప్రీంకోర్టు మళ్లీ నిప్పులు చెరిగింది. ఇది చాలా లోపభూయిష్టంగా ఉందని కేంద్రాన్ని కడిగేసింది. 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి.. అంతకన్నా తక్కువ వయసున్న వారు కొనుగోలు చేయాలని అనడం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇది ప్రాథమికంగా నియంత్రృత్వ పోకడకు అద్దం పడుతుందని.. ఏమాత్రం సహేతుకం కాదని విమర్శించింది. ఈ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. దీన్ని కేంద్రం సమీక్షించుకోవాలని అన్నది.

ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వ్యాక్సిన్లు ఎంతమేరకు అందుబాటులో ఉంటాయో రోడ్ మ్యాప్ ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా దేశ జనాభాకంతటికీ టీకా మందులు వేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పనేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమని సెకండ్ వేవ్ లో మరణించిన వారి అత్యధుకులు 45 ఏళ్లలోపు వారేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారని.. ఫంగస్ ల బారినపడ్డారని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. యువత ఎక్కువగా ఈసారి కరోనా బారినపడుతున్నారని.. అందుకే 45 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ ఉచితంగా వేయాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అన్నది ఉచితంగానే వేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక ప్రభుత్వ విధానాల్లో న్యాయవ్యవస్థ జోక్యం వద్దన్న కేంద్రం వాదనను సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ప్రజల రాజ్యాంగబద్దమైన హక్కులను హరించేవిధంగా ఉన్నప్పుడు కోర్టు మౌన ప్రేక్షకుల్లా ఉండజాలవని సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tags:    

Similar News