మోడీ కి ధీటైన మొనగాడు ఏడీ?

Update: 2019-04-15 10:42 GMT
ఒకవైపు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరి అభిమానాలు వారు చాటుకొంటూ ఉన్నారు. ప్రజలు తమ తీర్పును ఇస్తూ ఉన్నారు. ఇక ఎవరు గెలిచినా.. దేశం బాగుపడాలని - దేశం సమర్థవంతంగా సాగాలని - దేశానికి మేలు జరగాలని అనేక మంది భావిస్తూ ఉన్నారు. అంతిమంగా అందరికీ కావాల్సింది అదే.

మరి దేశం బాగుండాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని పీఠంలో కూర్చునే నేత సమర్థుడు కావాల్సిన అవసరం ఉంది. అతడు మేధావి అయినా  - సమర్థుడు అయినా ఫర్వాలేదు. మన్మోహన్ సింగ్ మేధావి రకానికి చెందిన వ్యక్తి. ఆయన రాజకీయ నేత కాదు. అయితే అప్పుడు రాజకీయాన్ని సోనియాగాంధీ చూసుకుంది. పదేళ్ల పాటు మన్మోహన్ ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారామె. అలా చూస్తే సోనియా సమర్థురాలే.

అయితే వారి పాలనలో అవినీతి వ్యవహారాలు తీవ్రం కావడంతో వారి కూటమి కుప్ప కూలింది. మోడీకి అవకాశం దక్కింది.ఇక మోడీ విషయానికి వస్తే ఈయన చాతుర్యంతో కూడిన రాజకీయ నేత. సమర్థుడు. గత ఎన్నికల్లో దేశాన్ని మొత్తం మెస్మరైజ్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారీయన. అయితే మోడీ చెప్పిన మాటలకూ ఆయన పాలనకూ పొంతన లేకుండా సాగింది. అద్భుతాలు జరిగిపోతాయని మోడీ ప్రచారం చేసుకున్నారు. అయితే అవేమీ జరగలేదు.

ఇక కొన్ని సాహసోపేత మైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని అంతగా ప్రభావాన్ని చూపకపోగా ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అలాంటి మోడీ టర్మ్ ముగిసినట్టే. ఈ టర్మ్ లో అద్భుతాలు చేయకపోయినా మరీ అద్వానమైన పాలన కాదు.. అని మోడీ అనిపించుకున్నారు.

ఒక రకంగా చూస్తే మోడీకి ప్రత్యామ్నాయం అవసరమే! మరి ఎవరా ప్రత్యామ్నాయం? ప్రధానిగా బాద్యతలు తీసుకుని నడిపించగల నేత ఎవరు? అని మోడీవ్యతిరేక కూటమివైపు చూస్తే కనీసం ఒక్కరూ కనిపించని పరిస్థితి.

కనీసం బీజేపీ  వైపు అయినా మోడీ కాకపోతే మరొకరు అనుకోవడానికి ప్రధాని అభ్యర్థులు కనిపిస్తున్నారేమో కానీ కాంగ్రెస్ వైపున మాత్రం కనిపించడం లేదు. రాహుల్ ఇప్పటి వరకూ సమర్థుడు అనిపించుకోలేదు. ఈ సారి ఆయన పార్టీ ఎన్ని ఎంపీ సీట్లను సాధిస్తుందనేదాన్ని బట్టి ఆయన సమర్థత బయటపడుతుంది.

ఇక ప్రియాంక వాద్రా ఉన్నారు కానీ, ఆమె సగం వరకూ మాత్రమే వస్తున్నారు. భర్త అవినీతి వ్యవహారాలు ఆమెకు మైనస్ పాయింట్. సోనియాగాంధీ రిటైరయిపోయినట్టే - మన్మోహన్ పరిస్థితీ అదే. ఇక వీరు గాక.. కాంగ్రెస్ కూటమి వైపు ఎవరికి దేశం పగ్గాలు అప్పగించాలి? అంటే సరిగ్గా ఒక్క పేరు చెప్పలేని పరిస్థితి.

వయసు అయిపోయిన వారు - అసమర్థులు - అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలిన వారు - ప్రజామోదం లేని వారు ఆ కూటమి వైపు ఎక్కువమంది కనిపిస్తూ ఉన్నారు. దీంతో మోడీకి  ధీటైన అభ్యర్థి కనిపించలేదనే చెప్పాలి.

ఒక దశలో శశిథరూర్ అన్నారు కానీ - ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో వివాదాలున్నాయి. గత రెండు దశాబ్దాల్లో సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలో వేరే వాళ్లను ఎవరినీ స్వతంత్ర నేతలుగా ఎదగనీయకపోవడం కూడా ఈ పరిస్థితి ఒక కారణం అని చెప్పవచ్చు! ఆ పరిస్థితే ఇప్పుడు కాంగ్రెస్ ను ఈ స్థితికి తీసుకొస్తూ ఉంది.
Tags:    

Similar News