‘ఆంధ్రా’ అన్నది కనిపించకూడదా మోడీజీ?

Update: 2021-02-07 04:30 GMT
అదేందో తెలీదు కానీ.. ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రా అన్న పదం నచ్చదా? అన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. ఆయన తీసుకున్న వరుస నిర్ణయాలు ఈ కొత్త అనుమానాన్ని తెర మీదకు తీసుకొస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఏపీలో పర్యటిస్తూ.. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని.. ఢిల్లీకి మించిన రాజధానిని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానమంత్రి అయ్యాక తన నోటితో తాను చెప్పిన మాటల్ని ఎలా తుంగలో తొక్కారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.

ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసిన మోడీ సర్కారు.. తర్వాతి కాలంలో మంచి పని తీరు కనిపించే ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులోకి విలీనం తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సగటు తెలుగోడు ఆవేదనను వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ.. అప్పట్లోనే ఉద్యమం జరిగి ఉంటే బాగుండేది. కానీ.. ఏపీలోని రాజకీయ పార్టీలు కంటితుడుపుగా వ్యవహరించాయే తప్పించి.. ఆంధ్రా ఉనికిని చాటే బ్యాంకు విలీనానికి తాము ససేమిరా అంటామని ఎలుగెత్తి ఉంటే బాగుండేది.

ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకులోకి కలిసిపోయి.. ‘ఆంధ్రా’ అన్న పదం కనుమరుగైపోయింది. ఇప్పుడు విశాఖ ఉక్కు వరకు వచ్చి ఆగారు మోడీ. నవరత్న కంపెనీల్లో ఒకటైన విశాఖ ఉక్కును 100 శాతం ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఇదంతా చూస్తే.. ఏపీ అన్నా.. ‘ఆంధ్ర’ అన్న పదం ప్రధాని మోడీకి నచ్చదా? ఢిల్లీలోని కేంద్రానికి ఇష్టం ఉండదా? అన్న కొత్త సందేహం కలుగుతోంది. నిత్యం నీతులు వల్లించే మోడీ.. ఒక భారీ సంస్థను అప్పనంగా ప్రైవేటుకు అప్పగించే బదులు.. దాన్ని ప్రభావవంతంగా పని చేసేలా ఎందుకు చేయటం లేదు? ఆ దిశగా ఆలోచనలు చేయకుండా.. అమ్మటమే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవటంలో అర్థమేమిటి? ఇదంతా చూస్తుంటే.. ఆంధ్రా అన్నది ఎక్కడా కనిపించొద్దా? అన్న సందేహం సగటు తెలుగోడికి రాక మానదు. మోడీజీ.. మా తెలుగోళ్ల అనుమానాల్ని తీరుస్తారా?
Tags:    

Similar News