పాలకులకు కోర్టులు డెడ్ లైన్ పెట్టే వరకు తెచ్చుకోవటమా?

Update: 2021-04-19 23:59 GMT
కరోనా సెకండ్ వేవ్ వేళ.. ఇప్పుడో సిత్రమైన సీన్ కనిపిస్తోంది. కేసులు భారీగా నమోదు కావటం.. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు.. పాజిటివ్ బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఆక్సిజన్ లభించదు.. రెమ్ డెసివర్ లాంటి అత్యవసర మందుల కోసం నానా పాట్లు పడాలి. ఇంతటి తీవ్ర పరిస్థితి ఉన్నా.. మరోవైపు రోడ్డు మీద అదే హడావుడి. అదేమీ పట్టనట్లుగా రద్దీ. చివరకు పరిస్థితుల్ని చూసి భరించలేని న్యాయస్థానాలు.. ప్రభుత్వాల్ని సూటిగా ప్రశ్నించే వరకు పరిస్థితి తెచ్చుకుంటున్నారు.

ఎందుకిలా? అసలేం జరుగుతోంది? ఒక్క తెలంగాణలోనే కాదు.. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. పక్కనున్న ఏపీలో సోమవారం వరకు స్కూళ్లు నడుస్తూనే ఉన్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వేళలో.. కేసుల తీవ్రత ఇంతలా పెరిగిపోతే.. రానున్న రోజుల సంగతేమిటి? అన్నది ఆలోచించటానికే భయమేసే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. రాజకీయం కోసం సభలు.. సమావేశాలు.. ధర్నాలు.. నిరసనలు నిర్వహించటం ఈ మధ్యన చూస్తున్నాం. బాధ్యత లేదని ప్రజల్ని నిందించే సమయంలో.. బాధ్యతతో వ్యవహరించాల్సిన నేతలు.. రాజకీయ ప్రయోజనం ప్రజల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారెందుకు? తాత్కాలిక ప్రయోజనాల కోసం.. దీర్ఘకాలంలో ప్రజలకు నష్టాలు కలిగించే పని చేయటం ఎంతవరకు సబబు?

సభలు.. సమావేశాలు.. ర్యాలీలపై నిషేధాన్ని ఎందుకు ప్రకటించరు? బార్లు.. పబ్బులు.. వైన్ షాపుల్ని ఎందుకు మూసేయరు? వాటి వల్ల వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి ముఖ్యమా? ప్రజారోగ్యం పట్టదా? ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేంటి? కర్ఫ్యూనా.. లాక్ డౌనా అన్నది తేల్చకుండా.. ఈ నాన్చటం ఏమిటి? కరోనా మహమ్మారి స్పీడ్ కు బ్రేకులు వేసేది ఎలా? దానికో యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? అన్న ప్రశ్నల వర్షానికి పాలకుల వద్ద సమాధానం లేని పరిస్థితి.

పాలకుల తీరుపై న్యాయస్థానాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేమే ఆదేశాలు జారీ చేయాలా? అన్న మాటను చూస్తే.. ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పే పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ప్రజాశ్రేయస్సుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారు.. తమ ప్రాథమిక కర్తవ్యాన్ని మర్చిపోవటం ఏమిటి? ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మీదనే తప్పించి.. ప్రజల ప్రాణాలకు పెద్ద విలువ లేదా? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చే ధైర్యం ఎవరికుంది?
Tags:    

Similar News