మందు పోయలేదని.. పెళ్లికొడుకును చంపేసిన స్నేహితులు

Update: 2020-12-17 03:21 GMT
స్నేహితుడి అర్థం మారుతోందా? అప్పటివరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. నవ్వుకుంటూ ఉంటూనే.. చిన్న తేడా రాగానే విచక్షణ మరిచి.. దారుణంగా వ్యవహరించే తీరు ఇటీవల కాలంలో చూస్తున్నాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. విన్నంతనే షాక్ కు గురయ్యే ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో చోటు చేసుకుంది.

తన పెళ్లి సందర్భంగా స్నేహితుల్ని పిలిచాడు అలీగఢ్ లోని పాలీముకీంపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల బబ్లూ. పెళ్లి పూర్తైంది. తన పెళ్లికి వచ్చిన మిత్రులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ ను పలుకరించటానికి వారి వద్దకు వెళ్లాడు బబ్లూ. అప్పటికే ఫుల్ గా తాగేసిన స్నేహితులు తమకు మరింత మందు ఇవ్వాలని కోరారు. అప్పటికే చాలా తాగేశారని.. ఇక మందు తీసుకురావటం సాధ్యం కాదని తేల్చాడు.

దీంతో.. అప్పటివరకు బాగానే ఉన్న స్నేహితులు.. మందుకు నో చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గొడవ పెట్టుకోవటం షురూ చేశారు. నెమ్మదిగా మొదలైన వాగ్వాదం.. కాసేపటికి రచ్చగా మారింది. ఈ క్రమంలో మిత్రుల్లో ఒకడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బబ్లూను పొడిచేశాడు. దీంతో తీవ్ర గాయానికి గురైన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే పెళ్లికొడుకు మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. దీంతో.. స్నేహితులంతా పరారయ్యారు. షాక్ కు గురైన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్నేహితుల కోసం సరదాగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు.. ఆ పెళ్లికొడుకు ప్రాణాల్నే తీసింది.
Tags:    

Similar News