కోడి కాళ్ల వివాదం హత్య దాకా వెళ్లింది

Update: 2020-12-15 11:30 GMT
ఒకరిని చంపాలంటే దానికి ఎంత పెద్ద కారణం ఉండాలి? మారిన కాలంలో ఇప్పుడుచాలా చిన్న విషయాలు మనుషుల్ని చంపే వరకు వెళ్లిపోతున్నాయి. అలాంటి ఉదంతమే ఒకటి పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంత చిన్న విషయానికి చంపేసే వరకు వెళ్లటమా? అది కూడా ఎవరో శత్రువు కాదు.. స్నేహితుడినే కావటం షాకింగ్ గా మారింది. మద్యం మత్తులో కోడి కాళ్ల మీద మొదలైన గొడవ చివరకు చంపే వరకు వెళ్లటం చూస్తే.. ఇంత దారుణంగా వ్యవహరించటమా? అన్న సందేహం కలుగక మానదు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారంలోకి వెళితే..

ఒడిశాకుచెందిన బసు.. పూజ.. బీమ్సన్.. బయా అనే నలుగురు వ్యక్తులు పెద్దపల్లి మండలంలోని ఒక ఇసుక బ్టటీలో కూలీలుగా పని చేస్తుంటారు.ఈ నెల తొమ్మిదిన వారు కోడి కాళ్లు.. పేగులు మార్కెట్ నుంచి తెచ్చుకొని వంట చేసుకున్నారు. పనిలో పనిగా మద్యాన్ని తెచ్చుకున్నారు. మందు తాగుతూ.. తాము తెచ్చుకున్న కోడి మాంసం తింటున్నవారి మధ్య అనుకోనిరీతిలో కోడి కాళ్ల రచ్చ మొదలైంది.

కోడి కాళ్లు తనకు ఇవ్వాలని బీమ్సన్ పేచీ పెట్టారు. మిగిలిన ముగ్గురితో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ముగ్గురు.. చెక్క దుంగతో బీమన్స్ తల మీద బలంగా కొట్టారు. దీంతో.. తీవ్రగాయాలైన బీమ్సన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో.. మిగిలిన ముగ్గురు ఇటుక బట్టీ యజమానులకు సమాచారం ఇచ్చారు. బీమ్సన్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఇటుక పెళ్లలు పడిపోవటంతో మరణించినట్లుగా ఆసుపత్రి నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొచ్చారు. కరీంనగర్ శ్మశాన వాటికలో శవాన్నిదహనం చేశారు. వీటికి బట్టీ యజమాని సహకరించాడు. అయితే.. అసలు విషయం బయటకు పొక్కటం..శ్రీనివాస్ అనే వ్యక్తి దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేయటంతో.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జరిగిన దారుణాన్ని చెప్పుకొచ్చారు. సరదాగా తినితాగాలన్న వ్యవహారం చివరకు ఒకరి హత్యకు కారణం కావటం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News