షిర్డీ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్న ట్రస్టు

Update: 2020-01-18 07:00 GMT
రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఒక ప్రకటనపై ఒక గుడి ట్రస్టు.. ఏకంగా గుడిని మూసేస్తామంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమానంగా సాయి జన్మించిన ప్రాంతాన్ని డెవలప్ చేస్తామంటూ రూ.100 కోట్లు కేటాయించిన వైనంపై షిర్డీ సాయిబాబా సంస్థాన్ తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. ఆదివారం నుంచి షిర్డీ సాయి టెంపుల్ ను నిరవధికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే.

నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే షిర్డీ గుడిని ఎలా మూసివేస్తారన్న విస్మయాన్ని భక్తులు వ్యక్తం చేయటమే కాదు.. అలాంటి ప్రకటన ఎలా చేస్తారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. షిర్డీ సంస్థాన్ ప్రకటన సంచలనంగా మారటంతో పాటు.. హాట్ టాపిక్ గా మారిన వేళ.. సంస్థాన్ ఒక ప్రకటనను తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం మీద శనివారం షిర్డీ గ్రామస్తులతో చర్చిస్తామని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూస్తామన్నారు.  

షిర్డీ గుడి మూసివేత మీద క్లారిటీ ఇవ్వని సంస్థాన్.. గ్రామస్తులతో మాట్లాడి.. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్న ప్రకటన అస్పష్టంగా.. అసంపూర్ణంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. రాజకీయంగా ఇబ్బంది ఉంటే ఆ విషయం మీద పోరాడాలి.. నిరసన చేయాలే కానీ ఇలా గుడిని మూసేస్తామన్న ప్రకటన సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News