శభాష్.. ఇలాంటి చట్టం మన దేశంలో ఎప్పటికి సాధ్యమో?

Update: 2020-11-26 06:15 GMT
వేలాది కోట్లు ఖర్చు పెట్టేసే ప్రభుత్వాలు.. సున్నితమైన అంశాల్ని పట్టనట్లుగా ఉంటాయి. తీవ్ర సమస్యగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ప్రభుత్వాలకు అస్సలు పట్టవు. ఇలాంటి వాటి విషయంలో స్కాట్లాండ్ మహిళలకు అండగా నిలిచేందుకు.. వారి అవసరాల్ని తీర్చేందుకు ప్రభుత్వమే నడుం బిగించింది. మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో అత్యంత ప్రధానమైనది నెలసరి. ఆ సమయంలో వారికి అవసరమైన వస్తువుల్ని అందించే విషయాన్ని ఏ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోదు. ఆ మాటకు వస్తే.. ఆ విషయం అసలు ప్రాధాన్యత అంశంగా ఉండదు.

ఇలాంటి వేళ.. మిగిలిన వారికి సైతం స్ఫూర్తిని ఇచ్చేలా స్కాట్లాండ్ ప్రభుత్వం వినూత్న చట్టాన్ని తీసుకొచ్చింది. పేదరికం కారణంగా నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని తీర్చే కొత్త చట్టం దన్నుగా నిలవనుంది. దీనికి సంబంధించిన బిల్లు ఆ దేశ చట్టసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. నెలసరికి అవసరమైన వస్తువుల్ని ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వనుంది.

తాజాగా ఆమోదం పొందిన చట్టం ప్రకారం స్కాట్లాండ్ లోని మహిళలు.. అమ్మాయిలకు అందుబాటులో ఉండేలా ఉచితంగా నెలసరి వస్తువులు లభిస్తాయి. విద్యార్థినులకు పాఠశాలలు.. కాలేజీల్లో అందుబాటులోకి వస్తాయి. ఈ బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టిన మోనికా లీనన్.. మాట్లాడుతూ.. పీరియడ్ పావర్టీని ఎదుర్కొనేలా ప్రపంచంలోని ప్రతిదేశం మహిళలకు నెలసరి వస్తువుల్ని ఉచితంగా అందించాలని కోరుతున్నారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లు చట్టంగా మారటంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కాట్లాండ్ దేశం ఒక్కటే.. ఈ సమస్యను అధిగమించిన దేశంగా నిలవకూడదని..అన్ని దేశాల్లోనూ ఇలాంటి వసతి ఉండాలని ఆమె కోరుతున్నారు. మరి.. మన దేశంలో ఇలాంటివి ఎన్నేళ్లకు చట్టరూపం దాలుస్తాయో? ఏమైనా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి.. దానికి చెక్ పెట్టేలా చేసిన స్కాట్లాండ్ చట్టసభకు అభినందనలు తెలియజేయాల్సిందే.
Tags:    

Similar News