హైదరాబాద్ లో అల్లర్లు.. కేటీఆర్ కు సమాచారం ఇచ్చింది వారేనట

Update: 2020-11-02 02:45 GMT
షాకింగ్ వ్యాఖ్యలు చేశారు మంత్రి కమ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మంత్రిగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాట్లాడిన ఆయన.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం బీజేపీ భారీ కుట్రకు తెర తీసినట్లుగా పేర్కొన్నారు.

హడావుడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు కొత్తసందేహాలకు తావిచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే.. హైదరాబాద్ లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తుందన్న విషయాన్ని ఆయనకు రహస్యంగా చెప్పిందో ఎవరో తెలుసా? బీజేపీ నేతలనేట. కేటీఆర్ కు అత్యంత సన్నిహితులైన బీజేపీ నేతలు ఫోన్లు చేసి.. తాజా కుట్ర గురించి తనకు సమాచారం ఇచ్చినట్లుగా కేటీఆర్ పేర్కొనటం గమనార్హం.

దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు హైదరాబాద్ అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తుందన్నారు. ప్రగతిభవన్ .. తెలంగాణ డీజీపీ కార్యాలయం.. తెలంగాణ భవన్ ను ముట్టడికి పిలుపునిచ్చారని.. పోలీసుల చేత లాఠీ ఛార్జి చేయించి.. అవసరమైతే ఫైరింగ్ చేసేలా చేసి.. సానుభూతి పొందాలన్న కుట్రకు తెర తీస్తున్నట్లు పేర్కొన్నారు. కుట్ర విషయాన్ని తమ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నట్లుగా కేటీఆర్ ఆరోపించారు.

శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఊరుకునేది లేదని హెచ్చరించిన కేటీఆర్.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ రాజకీయాల కోసం సొంత పార్టీ కార్యకర్తలను బలి చేయటం దుర్మార్గమని పేర్కొన్నారు. బీజేపీ డబ్బుల డ్రామాలు ఫెయిల్ కావటంతో.. అభ్యర్థి చేయి విరిగిందని.. బండి సంజయ్ పై దాడి జరిగిందని అబద్ధాల్ని ప్రచారం చేశారని.. అవి కూడా సక్సెస్ కాకపోవటంతో.. ఇప్పుడు అల్లర్లకు ప్లాన్ చేసినట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ చెప్పిన మాటలన్ని నిజమే అనుకుందాం. దుబ్బాక ఉప ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ మారటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఉప ఎన్నికను రెండుపార్టీలకు చెందిన వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నప్పుడు.. మంత్రి కేటీఆర్ కు బీజేపీకి చెందిన సన్నిహితులు ఫోన్లు చేసి మరీ కుట్రకు తెర తీస్తున్నారు.. పారాహుషార్ అని హెచ్చరించే అవకాశం ఉందా? అన్నది ప్రశ్న. అయినా.. ముట్టడికి పిలుపునిస్తే.. ఫైరింగ్ వరకు వెళుతుందా? ఇప్పటివరకు ఎన్ని ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిస్తే.. ఎన్నిసార్లు ఫైరింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి? లెక్కలు చెప్పాలంటే బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కిపోయిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News