చంద్రబాబును ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి

Update: 2020-06-11 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో వివిధ సమస్యలపై చంద్రబాబు ఓపెన్ లెటర్లు రాస్తే.. ఇప్పుడు ఆయనను ఫాలో అవుతున్నారు ఆయన మాజీ అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా సీఎం కేసీఆర్ కు ఓపెన్ లెటర్ రాశారు.

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తూ కరోనాపై యుద్ధం చేస్తున్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అనిర్వచనీయమని.. జీతాలు లేక.. అర్ధాకలితో సమాచారాన్ని సేకరిస్తూ ప్రజలకు అందిస్తున్న మీడియా ప్రతినిధులను కాపాడాలని కోరారు.  యువ రిపోర్టర్ మనోజ్ కుమార్ మృతి హృదయాన్ని కలిచివేసిందని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను  రేవంత్ రెడ్డి కోరారు.  రాష్ట్రంలోని ప్రతీ జర్నలిస్టుకి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతీ జర్నలిస్టు కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10వేలు ఆర్థిక సాయం చేయాలని బహిరంగలేఖలో కోరారు.

ఇక ఇటీవల మృతిచెందిన జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని లేఖలో రేవంత్ రెడ్డి కోరారు. వీటిపై తక్షణం స్పందించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.
Tags:    

Similar News