హోదాపై పవన్ మౌనం దేనికి సంకేతం..?

Update: 2016-05-07 15:08 GMT
గడిచిన వారం.. పది రోజుల్ని నిశితంగా పరిశీలిస్తున్నారా? ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయం మీద కేంద్ర సహాయమంత్రి కుదరన్న మాటను చెప్పటం.. ఆయన అలా వ్యాఖ్య చేసిన 24 గంటల వ్యవధిలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించటం తెలిసిందే. హోదా విషయలో ఏపీ అధికారపక్షం పోరాటం చేయాలంటూ ఆయన ట్వీట్ చేయటం తెలిసిందే.

మంత్రి చౌదరి మాటకే పవన్ కల్యాణ్ అంతలా రియాక్ట్ అయితే.. కేంద్రమంత్రి సిన్హా ఏకంగా లోక్ సభలోనే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చిన సమయంలో పవన్ తన గళం వినిపిస్తారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఆసక్తికరంగా అందుకు భిన్నంగా పవన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం గమనార్హం. ఏదైనా కీలక అంశాల విషయాల్లో వెనువెంటనే స్పందించే పవన్ కల్యాణ్.. కేంద్రమంత్రి సిన్హా వ్యాఖ్యల విషయంలో కామ్ గా ఎందుకు ఉంటున్నారన్నది పెద్ద ప్రశ్న. నిశితంగా పరిశీలిస్తే దీనికో కారణం ఉందన్న మాట వినిపిస్తోంది.

ప్రత్యకహోదా విషయాన్ని కేంద్రం అంత తేలిగ్గా నీళ్లు వదిలేస్తుందని పవన్ ఊహించలేదని చెబుతున్నారు. దీనికి తోడు నాలుగు రూపాయిలు వెనకేసుకొని సినిమాలకు త్వరగా గుడ్ బై చెప్పాలన్న తన ఆలోచనను సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ సందర్భంగా మీడియాకు ఇచ్చిన భారీ ఇంటర్వ్యూలలో పవన్ స్పష్టం చేయటం మర్చిపోకూడదు. అయితే.. సర్దార్ గబ్బర్ సింగ్ ఆర్థికంగా దెబ్బ తీయటం.. సర్దార్ ను నమ్ముకొని సినిమాను కొనుగోలు చేసిన వారు నష్టపోవటం.. వారి ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తీస్తున్నసినిమా తర్వాత మరో రెండు సినిమాలు వెనువెంటనే పవన్ చేయాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

అంటే.. కొద్దిరోజుల వరకూ వరుస పెట్టి సినిమాల మీదనే పవన్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలోనే అనూహ్యంగా ప్రత్యేక హోదా విషయం మీద పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కానీ తొందరపడి స్పందిస్తే.. హోదా విషయం మీద డైరెక్ట్ ఫైట్ షురూ చేయాల్సిందే. అదే జరిగితే సినిమాలు చేసే వీలు ఉండకపోవచ్చు. అలా అని రెండు పడవల మీద కాళ్లు వేయటం పవన్ కు మొదట్నించి ఇష్టం లేదు. అదే సమయంలో తాను రోడ్డు మీదకు వచ్చి నిరసనలు.. ఆందోళనలు చేస్తే మోడీ సర్కారు ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తుందా? అంటే అస్సలు ఇవ్వదనే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆవేశంతో చెలరేగిపోయే కంటే.. వ్యూహాత్మక మౌనమే మంచిదన్న ఉద్దేశంతోనే పవన్ తన తీరుకు భిన్నంగా ట్వీట్స్ చేయటం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదన నిజమేనా పవన్..?
Tags:    

Similar News