అమెరికాకు తలైవా.. అసలు కారణం అదే!

Update: 2021-01-03 10:41 GMT
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకే ఆయన అమెరికా వెళుతున్నట్లు తెలిసింది.  అన్నీ కుదిరితే తలైవా ఈ పాటికి పార్టీ పెట్టాల్సి ఉంది. డిసెంబర్ 31న రజనీ కొత్త పార్టీ పెట్టాల్సి ఉండగా అనూహ్య పరిణామాల మధ్య రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటన చేశారు. ఇది తమిళనాడులోని ప్రజలను అభిమానులను విస్మయానికి గురి చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా  రజనీ తీసుకున్న నిర్ణయం సరైన దేనని కొందరు మద్దతు ఇవ్వగా  చాలా మంది అభిమానులు విమర్శలు చేశారు.  దీంతో రజనీ మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్లు సమాచారం. దీంతో ఆయన కుటుంబీకులు మానసిక ప్రశాంతత కోసం త్వరలో ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.

మూడేళ్ళ కిందట రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ ప్రకటన చేశారు. అయితే అప్పటి నుంచి పార్టీ ప్రకటన గురించి వాయిదాలు వేస్తూ వచ్చిన తలైవా పార్టీ పెట్టడం ఖాయమేనని డిసెంబర్ 31 న  అన్ని వివరాలు చెబుతానని ప్రకటించారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులు రజనీ మక్కల్ మండ్రం నాయకులకు అప్పగించారు. ఆలోగా తన తాజా సినిమా  అన్నాత్తే షూటింగ్ కంప్లీట్ చేసేందుకు తలైవా హైదరాబాద్ వచ్చారు.

ఇక్కడ షూటింగ్ సెట్లో నలుగురు సిబ్బంది కరోనా బారిన పడటంతో రజనీ కూడా ఐసోలేషన్ కు పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఆయన హైబీపీతో తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరారు.  అక్కడ చికిత్స అనంతరం ఆయన నేరుగా చెన్నై వెళ్లిపోయారు.  ఆ తర్వాత కుటుంబీకులు - సన్నిహితులు - అభిమాన సంఘాల నాయకులతో చర్చించిన అనంతరం తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ రజనీ సంచలన ప్రకటన చేశారు.

దీంతో తలైవా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కొందరు అభిమానులు రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.  చాలా నగరాల్లో రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ శాంతియుత ర్యాలీలు నిర్వహించారు.  ఈ నేపథ్యంలో రజనీ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతత కోసం రజనీని కొద్ది రోజులు చెన్నై నగరానికి దూరంగా ఉంచాలని కుటుంబీకులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రజనీ కాంత్ అమెరికాకు వెళుతున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News