బాణాసంచా విక్రయాలపై రాజస్థాన్ సర్కార్ నిషేధం!

Update: 2020-11-02 11:50 GMT
దేశంలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. అయితే , జన జీవితం పూర్తిగా స్తంభించి పోవడం , ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చారు. అయితే , కరోనా నియమాలు పాటించడం తప్పనిసరి అని ప్రభుత్వం చెప్తుంది. కానీ, కొందరు మాత్రమే కరోనా నియమాలు పాటిస్తున్నారు. ఇక కరోనా వ్యాప్తి తర్వాత మన జీవితంలో భాగమైన పేస్ మాస్క్ , శానిటైజర్ ను కూడా వాడటం లేదు. ఇదిలా ఉంటే ... త్వరలో దీపావళి పండుగ ఉన్న  నేపథ్యంలో టపాసుల విక్రయంపై రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.

అయన నివాసంలో సోమవారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ.. టపాసుల విక్రయ లైసెన్సుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. టపాసులు కాల్చినపుడు వెలువడే పొగ వల్ల కరోనా  బాధితులు సహా గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు ఇబ్బందులు పడతారని, అందువల్ల దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచాకు దూరంగా ఉండాలని అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. అలాగే, రాజస్తాన్ లో మాస్కుల ధారణను తప్పనిసరి చేస్తూ సోమవారం నుంచే చట్టం తెస్తున్నామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కరోనా పై పోరుకు దేశంలో ఈ విధమైన చట్టం తేవడంలో తమదే మొట్టమొదటి రాష్ట్రమని ఆయన చెప్పారు. ‘మాస్క్ ఈజ్ ది వ్యాక్సీన్’ అని ఆయన అభివర్ణించారు.

జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ రెండో సారి విజృంభణ ప్రారంభమైందని, దీని వల్ల పలు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడకుండా ఉండాలంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరికలు జారీచేశారు. త్వరలో దీపావళి పండుగ ఉన్న సమయంలో సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం పై  చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే , కరోనా జోరు ఇంకా కొనసాగుతున్న తరుణంలో ఇష్టానుసారంగా పటాకులు కాల్చితే  , మళ్లీ జోరు పెరిగే అవకాశం ఉంది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి కాలుష్యం పెరుగుతున్న వేళ రాజస్థాన్ సీఎం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గత పది రోజులుగా రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్య నియంత్రణకు కేంద్రం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News