స‌మ్మ‌క్క‌ - సారక్క జాత‌ర‌కు రాహుల్‌

Update: 2018-01-10 15:45 GMT
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ బ‌లోపేతానికి త‌గిన క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా జాతీయ స్థాయి నాయ‌క‌త్వాన్ని కూడా ఆక‌ట్టుకునే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాహుల్ గాంధీకి తెలంగాణ కుంభ‌మేళగా పేరొందిన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు ఆహ్వానించారు.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారల‌మ్మ‌ జాతర గుర్తింపు ద‌క్కింది. ఈ జాత‌ర‌కు కాంగ్రెస్ అధినేత రాహుల్ ను తీసుకురావాలని ఉత్త‌మ్‌ పట్టుదలతో ఉన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న ఉత్త‌మ్ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. సమ్మక్క సారక్క జాతరకు వచ్చేందుకు రాహుల్ గాంధీని ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ కొప్పుల రాజు తదితరులతో భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. రాహుల్‌ గాంధీ సభ మేడారం జాతరకు ముందుగాని, తరువాత గాని ఉంటుందని స‌మాచారం.

కాగా, రాహుల్ ఇప్ప‌టికే దేవాల‌యాలు - మందిరాల్లో ప‌ర్య‌ట‌న‌కు ఆస‌క్తి క‌న‌బ‌ర్చుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రావ‌డం, దాంతోపాటుగా ప్ర‌తిష్టాత్మ‌క జాత‌ర‌లో పాలు పంచుకునేలా చేయ‌డం ద్వారా పార్టీ శ్రేణుల‌కు సానుకూల సందేశం పంపేందుకు ఉత్త‌మ్ కృషి చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో కూడా కాంగ్రెస్ నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.  తెలంగాణ‌లో కీల‌క‌మైన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా రాహుల్ సభను పెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News