మోడీకి మ‌ర‌కేసిన ద గ్రేట్ రాఫెల్ మిస్ట‌రీ!

Update: 2018-02-07 05:30 GMT
మూడున్న‌రేళ్లుగా మోడీ స‌ర్కారు ఏం చేసినా చేయ‌కున్నా.. అవినీతి జ‌ర‌గ‌కుండా ఉండ‌టంలోనూ.. కుంభ‌కోణాలు చోటు చేసుకోకుండా ఉండ‌టంలోనూ జాగ్ర‌త్త ప‌డింద‌ని చెబుతారు. మోడీకి వ్య‌తిరేకంగా మాట్లాడే వారికి ఎదురయ్యే పెద్ద ప్ర‌శ్న ఏమిటంటే.. మోడీ స‌ర్కారులో ఒక్క కుంభ‌కోణం జర‌గ‌లేద‌ని.. ఇంత స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను అందిస్తున్నందుకేనా మోడీని త‌ప్పు ప‌ట్టాలి? అని ప్ర‌శ్నిస్తుంటారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క స్కామ్ వెలుగు చూడ‌ని వేళ‌.. తాజాగా రాఫెల్ యుద్ధ‌విమానాల కొనుగోళ్ల‌లో భారీ కుంభ‌కోణం చోటు చేసుకుందంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ సంధిస్తున్న ఆరోప‌ణాస్త్రం ఇప్పుడు కొత్త క‌ల‌క‌లంగా మారింది.ప్ర‌ధాని మోడీపై నేరుగా ఆరోప‌ణ‌లు చేయ‌ట‌మే కాదు.. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

ఈ డీల్ నేప‌థ్యంలో భారీగా ముడుపులు చేతులు మారిన‌ట్లుగా ఆయ‌న మండిప‌డుతున్నారు. ఈ ఇష్యూను ద గ్రేట్ రాఫెల్ మిస్ట‌రీగా రాహుల్ అభివ‌ర్ణిస్తున్నారు. త‌న వాద‌న‌కు రాహుల్ బ‌లంగా సంధిస్తున్న ప్ర‌శ్న ఏమిటంటే.. రాఫెల్ యుద్ధ విమానం ఒక్కొక్క‌టి ఎంత పెట్టి కొన్నార‌ని. ఈ ప్ర‌శ్న‌కు మోడీ స‌ర్కారు స‌మాధానం చెప్ప‌నని చెబుతోంది. ఎందుక‌లా అంటే.. రాఫెల్ కొనుగోలులో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం.. ఒక్కో యుద్ధ విమానాన్ని ఎంత‌కు కొనుగోలు చేశామ‌న్న విష‌యాన్ని భార‌త్ బ‌య‌ట‌పెట్ట‌కూడ‌ని కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెబుతున్నారు.

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ జ‌రిగిన భార‌త్‌.. ఫ్రాన్స్ మ‌ధ్య ఒప్పందం ప్ర‌కారం.. ఒక్కో యుద్ధ విమానాన్ని ఎంత‌కు కొన్నార‌న్న విష‌యాన్ని భార‌త్ బ‌య‌ట‌పెట్ట‌కూడ‌ద‌ని.. అదే స‌మ‌యంలో ఎంత‌కు అమ్మామ‌న్న విష‌యాన్ని ఫ్రాన్స్ బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. దీనిపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంపై రాహుల్ తాజాగా దూకుడు పెంచారు. మోడీ స‌ర్కారుపై కంటే ప్ర‌ధాని మోడీపై నేరుగా ఆరోప‌ణ‌లు సంధించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఇంత‌కీ ఈ డీల్ ఏమిటి? ఎందుకు వివాదంగా మారింద‌న్న విష‌యాన్ని చూస్తే..

మిగ్ 21 యుద్ధ‌విమానాల స్థానే అత్యాధునిక‌మైన కొత్త త‌ర‌హా ఫైట‌ర్ జెట్స్ ను కొనుగోలు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న భార‌త్ లో ఎప్ప‌టి నుంచో ఉంది. 126 మిరేజ్ - 2000 మోడ‌ల్ ను కొనాల‌న్న ప్ర‌పోజ‌ల్ 2000లో వ‌చ్చింది. దీనిస్థానే 2007లో మ‌ధ్య‌శ్రేణి బ‌హుళార్థ‌సాధ‌క వార్ జెట్స్ ను కొనుగోలు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. దీంతో.. ఈ డీల్ కోసం ప్ర‌పంచంలో ఆరు ఆగ్ర‌శ్రేణి యుద్ధ‌విమానాల త‌యారీ సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి.

ఇక్క‌డి వ‌ర‌కూ విష‌యం మొత్తం బాగానే ఉన్నా..ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంద‌ని చెబుతారు. పోటీ ప‌డిన ఆరు సంస్థ‌ల్లో రెండు సంస్థ‌ల్ని ఫైన‌ల్ చేశారు.  అందులో ఒక‌టి ఫ్రాన్స్ కు చెందిన ద‌సాల్ట్ రాఫెల్ కంపెనీ కాగా.. రెండోది నాటోకు చెందిన యుద్ధ విమానాలు స‌ర‌ఫ‌రా చేసే యూరో ఫైట‌ర్ టైఫూన్‌. ఈ రెండు కంపెనీల్లో రాఫెల్ విమానాలు ఖ‌రీదైన‌వి. ఒక టైపూన్ కంటే రాఫెల్ యుద్ధ విమానం దాదాపు రూ.453 కోట్లు ఎక్కువ‌గా చెబుతారు. ఒక టైపూన్ విలువ 138 మిలియ‌న్ యూరోలైతే.. ఒక రాఫెల్ విలువ 197 మిలియ‌న్ యూరోలుగా చెబుతారు. 36 రాఫెల్ యుద్ధ విమానాల విలువ దాదాపు రూ.58వేల కోట్లు. అయితే.. త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే టైపూన్ల‌ను వ‌దిలేసి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు మోడీ స‌ర్కారు ఎందుకు ఓకే చెప్పింద‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌.

126 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయాల‌న్న‌ది ఎప్ప‌టి నుంచో ఉన్న ప్ర‌పోజ‌ల్ అయితే దాన్ని 36 యుద్ధ విమానాల‌కు కుదించ‌టం ఏమిట‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. దీనిపై మోడీ స‌ర్కారు సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం చెప్ప‌టం లేద‌ని రాహుల్ మండిప‌డుతున్నారు. రాఫెల్ డీల్ అంశంలో ప్ర‌ధాని మోడీపై నేరుగా ఆరోప‌ణ‌లు చేయ‌టానికి ముందు రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఒక్కో యుద్ధ విమానానికి అయ్యే ఖ‌ర్చు ర‌హ‌స్యం.. ఎంత‌కు మాట్లాడుకున్నారో సీక్రెట్‌. ఆ ధ‌ర పార్ల‌మెంటుకు చెబితే దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంది. అడిగిన వారిని జాతి వ్య‌తిరేకులుగా ముద్ర వేస్తారు. ర‌క్ష‌ణ మంత్రి చెబుతున్నదానికి అర్థం.. దీని వెనుక ఓ భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని అంటూ రాహుల్ క‌డిగేశారు.

ఈ ఇష్యూలో తెర‌పైకి వ‌స్తున్న ఏ ప్ర‌శ్న‌కు మోడీ స‌ర్కారు సంతృప్తిక‌రంగా స‌మాధానం ఇవ్వ‌టం లేద‌ని చెబుతున్నారు. ఈ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌న్న సందేహాల‌కు బ‌ల‌మిచ్చేలా కొన్ని ప్ర‌శ్న‌లు కీల‌కంగా మారాయి. త‌న నిజాయితీని నిరూపించుకోవాలంటే మోడీ స‌ర్కారు ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వాల‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇంత‌కీ ఆ ప్ర‌శ్న‌లేమిట‌న్న‌ది చూస్తే..

+ మొద‌ట అనుకున్న 126 యుద్ధ విమానాల కొనుగోలు ప్ర‌తిపాద‌న‌ను మార్చేసి 36 మాత్ర‌మే ఎందుకు కొన్నారు?

+ టైఫూన్ యుద్ధ విమ‌నాల కంపెనీని ప‌క్క‌న పెట్ట‌టం వెనుక అస‌లు విష‌య‌మేంది?

+ 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ అనుమ‌తి తీసుకోలెందుకు?

+ ఒప్ప‌దం కుదుర్చుకున్న ఒక్కో రాఫెల్ యుద్ధ విమానానికి ఎంత చెల్లిస్తున్నారు?

+ యూపీఏ హ‌యాంలో ఒక్కో యుద్ధ విమానం స‌గ‌టున రూ.526 కోట్లు. ఇప్పుడు రూ.1517 కోట్ల‌కు ఎలా పెరిగింది?  

+ రూ.58 వేల కోట్లు ఖ‌ర్చు చేసి యుద్ధ‌విమానాలు మాత్ర‌మే కొనుగోలు చేస్తున్నారు. యుద్ధ విమానాల‌తో ప్ర‌యోగించే మిసైళ్లల‌కు అద‌నంగా చెల్లించాల్సి రావ‌టమా?
Tags:    

Similar News