రాహుల్ టూర్లో జ‌రిగిన రెండు దిద్దుకోలేని పొర‌పాట్లు ఇవే

Update: 2022-05-08 10:30 GMT
కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ ప‌ర్య‌ట‌న ఆ పార్టీ రాష్ట్ర నేత‌ల్లో జోష్ నింపింది. రైతుల‌కు భ‌రోసా నింప‌డం, పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అవ‌డం, చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను పరామర్శించడం వంటి కార్య‌క్ర‌మాల‌తో రాహుల్ బిజీబిజీగా గ‌డిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల‌తో పార్టీ నేత‌లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లు రాహుల్ టూర్లో లోపాలు వెతుకుతూ దిద్దుకోలేని పొర‌పాట్లు చేశార‌ని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. అదే  మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు నివాళి అర్పించ‌క‌పోవ‌డం, గన్‌పార్క్‌ ముందు నుంచే పలుమార్లు వెళ్లినా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించక‌పోవ‌డంపై ఆరోపణ‌లు గుప్పిస్తున్నారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో శనివారం ఉదయం సంజీవయ్య పార్క్‌కు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి, దళిత నాయకుడు దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించిన రాహుల్‌ అదే సమయంలో పీవీ నరసింహారావుకు నివాళి అర్పించడాన్ని మర్చిపోవడం గమనార్హం అంటూ టీఆర్ఎస్ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. సంజీవయ్య పార్క్‌కు పక్కనే ఉన్న పీవీ ఘాట్‌ వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. సంజీవయ్యకు నివాళి అర్పించడం మంచిదే కానీ, అదే సమయంలో పీవీని మర్చిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడుతున్నారు. దీనిని బట్టి పీవీపై కాంగ్రెస్‌ పార్టీకి కోపం ఇంకా తీరినట్టు లేదనే విమర్శలు వినవస్తున్నాయి. దేశానికి ఎంతో సేవ చేసిన పీవీకి ఢిల్లీలో కనీసం సమాధి లేకుండా చేశారని, ఇప్పుడు హైదరాబాద్‌లో ఆయన సమాధికి కనీసం దండం కూడా పెట్టరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

గ‌న్ పార్క్‌లోని అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళులు  అర్పించ‌క‌పోవ‌డంపై సైతం టీఆర్ఎస్ పార్టీ త‌ప్పుప‌డుతోంది. రెండు రోజుల పర్యటనలో ఒక్కసారి కూడా తెలంగాణ నినాదం చేయలేదు స‌రికదా అమరవీరుల ప్రస్తావన లేదని టార్గెట్ చేస్తోంది. అమరుల త్యాగానికి గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి రాజకీయం చేసిన రాహుల్ గాంధీ గ‌న్‌పార్క్‌ ముందు నుంచే పలుమార్లు వెళ్లినా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించాలనే సోయి కూడా లేదంటూ టీఆర్ఎస్‌ పార్టీ నేత‌లు కామెంట్లు చేస్తున్నారు. గన్‌పార్క్‌లో అమరులకు నివాళి అర్పించే తీరిక లేదు కానీ, చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను పరామర్శించడానికి మాత్రం సమయం దొరికిందా? అంటూ మండిపడుతున్నారు. రాహుల్ ఈ రెండు పొర‌పాట్లు చేయ‌క‌పోతే, టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ కోణంలో టార్గెట్ చేసే అవ‌కాశం దొరికేది ఉండ‌క‌పోయేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News