వాళ్లంద‌రికీ గుడ్ బై చెప్ప‌నున్న యువ‌రాజు

Update: 2017-03-28 06:38 GMT
దెబ్బ మీద దెబ్బ అన్న‌ట్లుగా కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఉంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అప్పుడ‌ప్పుడు ఏదో చిన్నాచిత‌కా విజ‌యాలే త‌ప్పించి.. పార్టీ ఫ్యూచ‌ర్ బ్ర‌హ్మాండంగా ఉంటుంద‌న్న సంకేతాలు అందేలా ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోక‌పోవటం తెలిసిందే. అంద‌రి కంటే ముందే యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొద‌లెట్టిన కాంగ్రెస్‌ కు దారుణ‌మైన ప‌రాజ‌యం ఎదురైంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపై వివిధ మీడియా సంస్థ‌లు జ‌రిపిన స‌ర్వేల్లో బీజేపీ బంప‌ర్ విజ‌యాన్ని స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోయినా.. కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యాన్ని మాత్రం చాలా చ‌క్క‌గా అంచ‌నా వేయ‌టాన్ని మ‌ర్చిపోలేం.

యూపీలో ఎదురైన దారుణ ఓట‌మి అనంత‌రం.. గుట్టు చ‌ప్పుడు కాకుండా విదేశాల‌కు వెళ్లిపోయి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాజాగా తిరిగి వ‌చ్చారు. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న త‌ల్లి సోనియా వ‌ద్ద ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీని ఏ రీతిలో ప్రక్షాళ‌న చేయాల‌న్న అంశం మీద సుదీర్ఘంగా చ‌ర్చించి.. ఒక ప‌క్కా వ్యూహంతో దేశంలోకి అడుగుపెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

త‌న వ్యూహాన్ని అమ‌లు చేయ‌టంలో భాగంగా.. వృద్ధ నాయ‌కులు.. వారి వార‌సుల్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి.. యువ నాయ‌క‌త్వాన్ని కొత్త‌గా నిర్మించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

గోవాలో అత్య‌ధిక స్థానాలు చేజిక్కించుకున్నా.. పార్టీ సీనియ‌ర్ నేత‌ల ఆల‌స‌త్వంతో అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే విష‌యంలో జ‌రిగిన జాప్యంపై రాహుల్ అండ్ కో సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి కార‌ణ‌మైన దిగ్విజ‌య్ సింగ్ పై వేటు వేయ‌టంతో పాటు.. ఆ త‌ర‌హా నేత‌ల్ని వ‌దిలించుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీలో ఎక్క‌డకు వెళ్లినా త‌గిలే ముస‌లి వాస‌న‌ను వ‌దిలించుకోవాల‌ని బ‌లంగా భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌ల్ని వేదిక‌గా చేసుకొని.. ఆ ప‌ని పూర్తి చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిస్వార్థంగా ప‌ని చేసే వారు.. యువ‌త‌కు పెద్ద పీట వేస్తూ.. పార్టీకి బ‌ల‌మైన అండ‌గా నిల‌బ‌డే వారిని గుర్తించి.. ప్రోత్స‌హించి.. వారికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాల వారీగా కొత్త నాయ‌క‌త్వాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల రాహుల్ చేయించిన స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం పార్టీలో యువ‌త‌కు పెద్ద పీట వేసి.. కొత్త నాయ‌క‌త్వానికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని.. ఈ విష‌యంపై రాహుల్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. కొంత‌మంది కాంగ్రెస్ నేత‌ల్ని చూసిన వెంట‌నే అవినీతి.. కుంభ‌కోణాలు గుర్తుకు వస్తుంద‌ని.. అలాంటి నేత‌ల‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌న్న క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు నిర్వ‌హించుకోవ‌టానికి ఎన్నిక‌ల సంఘం డిసెంబ‌రు వ‌ర‌కు సమ‌యం ఇచ్చిన నేప‌థ్యంలో.. ఆ లోపు క‌స‌ర‌త్తు పూర్తి చేసి.. వృద్ధ వాస‌న‌ల్ని  పార్టీకి దూరం చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఈ ప్ర‌క్షాళ‌న అయినా కాంగ్రెస్ ద‌శ‌.. దిశ‌ను మారుస్తుందేమో చూడాలి. 


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News