రాహుల్ కు పగ్గాలు-ప్రియాంకకు రాజ్యసభ

Update: 2022-05-15 16:38 GMT
కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి జరిగిన మూడు రోజుల చింతన్ శిబిర్ సదస్సులో కీలకమైన నిర్ణయాలను తీసుకున్నది. షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది కేవలం రెండేళ్ళేకాబట్టి వెంటనే పార్టీ ఉత్తేజానికి చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీకి వెంటనే పార్టీ పగ్గాలను అప్పగించాలని, ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపాలనేది కీలకమైన నిర్ణయాల్లో రెండుమాత్రమే.

పార్టీనేతలను, కార్యకర్తల్లో జోష్ పెంచటంలో భాగంగా వెంటనే రాహుల్ కు పార్టీ పగ్గాలను అప్పగించాలని మెజారిటి నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర చేయాలని కూడా డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయాన్ని స్వయంగా రాహూలే తీసుకున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయటం మధ్యలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలను పార్టీకి దగ్గర చేయటమే ధ్యేయంగా పాదయాత్ర ప్రారంభమవ్వబోతోంది.

మధ్య, దిగువతరగతి జనాలు పార్టీకి దూరమైపోయారని రాహుల్ తన స్పీచులో బాధపడిపోయారు. అలాంటి వారందరినీ మళ్ళీ పార్టీకి దగ్గర చేయటం కోసమే తాను పాదయాత్ర చేయబోతున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతుంది. అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ కేటాయించాలని, ఒక నేతకు రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు వరసగా ఎంపిక చేయాలనేది కూడా కీలకమైనదే.

అలాగే 50 ఏళ్ళలోపు యువనేతలకు పార్టీలో పెద్ద పీటవేయాలని, పార్టీలోని అన్నీ స్ధాయిల్లోని స్ధానాలను 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించాలనేది కూడా కీలకమైనదే. పార్టీ పగ్గాలు అందుకునేందుకు రాహుల్ ముందుకురాకపోతే ప్రియాంకకు పగ్గాలు అప్పగించాలని కూడా నేతలు అభిప్రాయపడ్డారు. కర్నాటక నుండి ప్రియాంకను రాజ్యసభకు ఎంపికచేయాలని కూడా దాదాపు డిసైడ్ అయింది. ఎందుకంటే కర్నాటక నుండి రెండుస్ధానాలు కాంగ్రెస్ కు అవకాశముంది. గతంలో కర్నాటక నుండి లోక్ సభకు చిక్ మగళూరు నుండి దివంగత ప్రధానమంత్రి ఇందరిగాంధి ఎంపికైన విషయాన్ని నేతలు గుర్తుచేశారు. కాబట్టి ప్రియాంక కర్నాటక నుండి రాజ్యసభకు వెళ్ళటం దాదాపు ఖాయమైనట్లే అనుకోవాలి.
Tags:    

Similar News