జగన్ కు కొత్త అనుభవాన్ని మిగిల్చిన పులివెందుల బిడ్డ!

Update: 2023-03-19 10:28 GMT
ఏపీలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ.. ముచ్చటగా మూడో స్థానమైన పశ్చిమ రాయలసీమ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేయటం తెలిసిందే. అయితే..  మూడో స్థానంలో టీడీపీ గెలిచినట్లుగా ప్రకటించినా.. గెలుపును అధికారకంగా పేర్కొంటూ ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవటం వివాదంగా మారింది. దీనిపై ఇప్పుడు హైడ్రామా నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ రాయలసీమ పరిధిలో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది.

కడప జిల్లా అన్నంతనే వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా అభివర్ణించటం తెలిసిందే. ఇక.. పులివెందుల నియోజకవర్గం గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కలలో సైతం పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని కాకుండా మరొకరికి అధిక్యత లభించే అవకాశమే ఉండదు. అందుకు భిన్నంగా తాజాగా ఆ బలమైన అభిప్రాయానికి భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చోటు చేసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీనంతటికి కారణం టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. ఇంతకీ ఆయన ఎవరు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే షాకిచ్చే ఫలితాన్ని ఎలా తీసుకురాగలిగారు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ.. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి పులివెందులకు ఉన్న అనుబంధం మీద ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటి వివరాల్ని చూస్తే.. 1969 మార్చి 23న వీరారెడ్డి.. లక్ష్మీదేవమ్మల సంతానంగా ఆయన జన్మించారు. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలానికి చెందిన వారు. బీఎస్సీ.. బీఈడీ.. ఎల్ఎల్ బీ పూర్తి చేసిన ఆయన.. 1990-94 మధ్యలో ఉదయం దినపత్రికలో పాత్రికేయుడిగా పని చేశారు. 1996లో టీడీపీలో చేరారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా.. తెలుగు యువత రాష్టర ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

ఆయన సతీమణి ఉమాదేవి. ఆమె సింహాద్రిపురం మండలం కాంబెల్లి సర్పంచిగా పని చేశారు. పాత్రికేయుడిగా సుపరిచితుడు.. టీడీపీలో దీర్ఘకాలంగా పని చేస్తూ.. పార్టీ కి వీర విధేయుడిగా ఆయనకు పేరుంది. పార్టీ పట్ల పూర్తి విధేయతతో వ్యవహరించే ఆయనకు.. మంచి వర్కర్ గా పేరుంది. కానీ.. పార్టీ పదవులు తప్పించి.. చట్టసభల్లో ఎలాంటి పదవులు పొందింది లేదు. అలాంటి ఆయనకు.. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించింది.
4

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం రావటం.. మంచి కసి మీద ఉన్న ఆయన పెద్ద ఎత్తున శ్రమించారని చెబుతారు. వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటం.. వివాదాలకు దూరంగా ఉండే తత్త్వం ఆయనకు సానుకూలంగా మారింది. దీనికి తోడు.. వ్యూహాత్మకంగా పార్టీ వ్యవహరించటం ఆయనకు మరింత లాభాన్ని చేకూర్చింది. ఎంతోకాలంగా రాజకీయాల్లో ఉన్నా లభించని ఎలివేషన్.. తాజా గెలుపుతో ఆయన రాత్రికి రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారికి సుపరిచితుడిగా మారారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ అధిక్యత లభించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News