ఏపీలో రెండు ఉప ఎన్నిక‌లు... మూడోది కూడానా ?

Update: 2021-07-10 02:30 GMT
ఏపీలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఏపీలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. క‌డ‌ప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గత మార్చి నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఇక్క‌డ ఆరు నెల‌ల్లోనే ఉప ఎన్నిక జ‌ర‌గాలి. అయితే క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంతో బ‌ద్వేల్ ఉప ఎన్నిక సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. బ‌ద్వేల్‌, హుజూరాబాద్ రెండు స్థానాల ఉప ఎన్నిక‌ల‌కు ఒకేసారి నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఏపీలో బ‌ద్వేల్ తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర‌సిస్తూ గంటా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న స్పీక‌ర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశారు. అయితే దీనిపై ఇంకా స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. స్పీక‌ర్ క‌నుక గంటా రాజీనామా ఆమోదిస్తే అక్క‌డ కూడా ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. అప్పుడు బద్వేల్, విశాఖ నార్త్ స్థానాలకు ఉపఎన్నికలు జరుగతాయి. ఈ రెండు స్థానాల్లో బ‌ద్వేల్ వైసీపీకి కంచుకోట‌. అక్క‌డ గ‌త ఇర‌వైఏళ్ల‌లో టీడీపీ ఎప్పుడూ గెల‌వ‌లేదు. ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌న్న ఆశ‌లు కూడా వారికి లేవు. గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీకి ఏకంగా 40 వేల పై చిలుకు మెజార్టీ వ‌చ్చింది. రేపు ఉప ఎన్నిక‌ల్లో ఇది పెరుగుతుందే త‌ప్పా ?  త‌గ్గే ఛాన్స్ లేదు.

ఇక విశాఖ నార్త్‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన‌ట్టు 1900 ఓట్ల‌తో గెలిచింది. అదే జీవీఎంసీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ స్వీప్ చేసేసింది. పైగా ఈ రెండేళ్ల‌లో ఇక్క‌డ గంటా బేజార‌వ్వ‌డంతో పాటు టీడీపీ కేడ‌ర్‌ను వ‌దిలేయ‌డంతో వాళ్లంతా వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక్క‌డ ట‌ఫ్ పోటీ ఉన్నా వైసీపీకే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. పైగా ఉప ఎన్నిక‌లు వ‌స్తే ఖ‌చ్చితంగా గంటా అయితే పోటీ చేయ‌రు. ఇక న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజుపై వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీలు స‌ర్వ‌దా, శ‌త‌ధా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అవేమ‌న్నా వ‌ర్క‌వుట్ అయితే అప్పుడు మూడో ఉప ఎన్నిక కూడా న‌ర‌సాపురంలో చూడొచ్చు..!
Tags:    

Similar News