మూడవ కూటమితో మూడేది ఎవరికి... ?

Update: 2021-12-27 15:31 GMT
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా సగం సమయం ఉన్నా కూడా ఇప్పటి ఉంచే వేడి రాజుకుంటోంది. సడెన్ గా ఏపీలో కొన్ని ప్రధాన సామాజికవర్గాలు సమావేశాలు నిర్వహించడంతో చలికాలంలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. మాజీ మంత్రి ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వాన మూడవ కూటమి ఏపీలో అవతరించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో టీడీపీ ఒక్కసారిగా అలెర్ట్ అయింది.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్ ఫైట్ జరగాలని టీడీపీ గట్టిగా కోరుకుంటోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అయితే కచ్చితంగా ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మూడవ పక్షం ఎంట్రీ ఇస్తే కనుక అది విపక్షాలలో పెద్ద చీలికను తెస్తుంది. దాంతో ఏపీలో మరోమారు అధికార పార్టీకే అడ్వాంటేజ్ గా మారుతుందన్న లెక్కలు ఉన్నాయి.

దీనికి 2009 ఎన్నికలు ఒక ఉదాహరణ. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టకపోయి ఉంటే చంద్రబాబు గెలిచి సీఎం అయ్యేవారు. చిరంజీవి రాకతో టీడీపీ ఓట్లకే గండి పడింది. ఇపుడు మూడవ కూటమి పేరిట కాపులు కనుక ముందుకు వస్తే ఆ చీల్చే ఓట్లు అన్నీ కూడా టీడీపీవే అవుతాయని ఒక కచ్చితమైన అంచనా ఉంది. అదే టైమ్ లో అధికార పార్టీ మీద వ్యతిరేకత కూడా చెల్లాచుదురు అవుతుంది. ఎవరికి వారుగా పంచుకుంటారు. దాంతో సులువుగా వైసీపీ పవర్ లోకి వస్తుందన్న ఆలోచనలు చేసే వారూ ఉన్నారు.

దాంతో ఇపుడు ఏపీలో మూడవ ప్రత్యామ్నాయం మీదనే చర్చ తీవ్రంగా సాగుతోంది. ఈ మధ్య అంటే కొద్ది రోజుల క్రితం ఏపీలోని ప్రముఖ కాపు నాయకులు, వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, బడా నాయకులు ఒక చోట చేరి మంతనాలు జరిపినట్లుగా ప్రచారం సాగుతోంది. అందులో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, వంగవీటి రాధా, జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ వంటి వారు ఉన్నట్లుగా చెబుతున్నారు.

వీరంతా కలసి కాపుల నాయకత్వాన ఒక రాజకీయ వేదిక అవసరమని భావించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ప్రధాన అనుచరులు కూడా హాజరయ్యారని అంటున్నారు. ఇక దీని తరువాత ముద్రగడ కూడా బీసీలు, ఎస్సీలు, ఇతర నేతలతో మీటింగ్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఇవన్నీ కలసి ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ కే దారితీసేలా సీన్ ఉందని అంటున్నారు.

అయితే ముద్రగడ పద్మనాభం నాయకత్వం అంటే అది కచ్చితంగా టీడీపీకి యాంటీగానే ఉంటుంది అని అంటున్నారు. ఆయనకు చంద్రబాబు మీద ఈ రోజుకీ కోపం పోలేదని చెబుతారు. ఇక జగన్ తో కూడా ముద్రగడ కలిసే ప్రసక్తి లేదని అంటారు. దాంతో మూడవ పక్షం అంటూ వస్తే ఏపీలో రాజకీయ సమరం కాస్తా అధికార వైసీపీ, విపక్ష టీడీపీతో పాటు, తృతీయ పక్షం మధ్యనే కేంద్రీకృతమవుతుందని కూడా చెబుతున్నారు. అది కచ్చితంగా టీడీపీకి నష్టం చేకూర్చే పరిణామమని కూడా అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో అధికార వైసీపీకి కూడా ఇబ్బందిగా మారే సీన్ ఉందని కూడా మరో అంచనా ఉంది. ఏది ఏమైనా మూడవ పార్టీ ఏది వచ్చినా ఇప్పటికిపుడు గెలిచే సీన్ ఉందా అన్నదే చర్చ. అలాగే ఏపీలో పొలిటికల్ స్పేస్ కూడా లేదు అన్న మాట ఉంది. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని జగన్, చంద్రబాబు నడుపుతున్నారు. ఈ ఇద్దరికీ జనంలో పాపులారిటీ ఉంది. అంగబలం, అర్ధంబలం కూడా ఉంది.

ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం మాత్రమే ఉంది. జనంలోకి ఫొకస్డ్ గా వెళ్ళి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అంటే అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అయితే ఈ మూడవ పక్షానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తే కధ మారే చాన్స్ ఉంది. కానీ పవన్ అలా ముందుకు వస్తారా, వస్తే మూడవ కూటమి నేతలు ఎంతమంది ఆయన వెంట ఉంటారు అన్న మాటా ఉంది. మొత్తానికి మూడవ పార్టీ మాత్రం ఏపీ రాజకీయాల్లో హీట్ ని పుట్టిస్తోంది. అది కనుక మెటీరియలైజ్ అయితే కచ్చితంగా రాజకీయ సమీకరణలు మొత్తానికి మొత్తం మారడం ఖాయం.


Tags:    

Similar News