కోడి గుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కయిన పోలీస్..!

Update: 2021-05-16 04:30 GMT
నేరగాళ్లు , మోసగాళ్ల భరతం పట్టేది పోలీసులే. ముఖ్యంగా కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీసులకు మంచి పేరే వచ్చింది. కానీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ నాలుగు కోడిగుడ్లు దొంగతనం చేస్తూ అడ్డంగా కెమెరా కంటికి దొరికిపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో గుడ్లు దొంగతనం చేసి నందుకు ఏకంగా ఉద్యోగమే పోగొట్టుకున్నాడు.

ఫతేఘర్ సాహిబ్ పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రీత్ పాల్ సింగ్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యాపారి రిక్షాలో కోడిగుడ్ల ట్రేలు పెట్టుకొని అటుగా వచ్చాడు. ఏదో పని పడి రోడ్డు పక్కగా రిక్షాను ఆపాడు. అక్కడే వున్న హెడ్ కానిస్టేబుల్ ప్రీత్ పాల్ సింగ్ వ్యాపారి అటుగా వెళ్ళగానే మెల్లిగా ట్రేలో చేతులు పెట్టి నాలుగు గుడ్లు బయటకు తీసి ఫ్యాంట్ జేబులో పెట్టుకున్నాడు.

తనను ఎవరూ చూడలేదని భావించాడు. ఆ తరువాత వ్యాపారి తన పని ముగించుకుని అక్కడికి వచ్చాడు. అప్పుడు హెడ్ కానిస్టేబుల్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఓ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. ఈ తతంగమంతా పక్కనే ఉండి గమనిస్తూ మొబైల్ లో వీడియో తీసిన కొందరు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దొంగలను పట్టుకోవలసిన పోలీసు కేవలం గుడ్ల కోసం కక్కుర్తి పడటం ఏమిటని విమర్శలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు చేరడంతో అతడు చేసిన తప్పుకు విధుల నుంచి సస్పెండ్ చేశారు.



Tags:    

Similar News