ఇక నుంచి మందుబాబుల బాధ్య‌త మీదే.. బార్ షాపుల‌కు పోలీసు సూచ‌న‌..!

Update: 2021-04-11 10:39 GMT
రోడ్డు ప్ర‌మాదాలు ఎన్ని జ‌రుగుతున్నా.. ఎన్ని ప్రాణాలు పోతున్నా.. పోలీసులు ఎన్నికేసులు పెడుతున్నా.. మందుబాబుల తీరు మాత్రం మార‌ట్లేదు. మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డాన్ని మానుకోవ‌ట్లేదు. డ్రంకెన్ డ్రైవ్ నిరోధించ‌డానికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. పూర్తిస్థాయి ఫ‌లితాలు రావ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో మ‌రో కొత్త ప్ర‌తిపాద‌న‌తో వ‌చ్చారు పోలీసులు.

ఈ మేర‌కు బార్లు, రెస్టారెంట్లు, ప‌బ్‌లు, వైన్ షాపుల నిర్వాహ‌కుల‌తో సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక‌స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తాగి వాహ‌నాలు న‌డ‌పడం వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల‌ను, న‌ష్టాల‌ను వివ‌రించారు. వీటి నివార‌ణ‌కు వారు తీసుకోవాల్సిన సూచ‌న‌లు వివ‌రించారు.

తాగ‌డానికి వ‌చ్చేవారికి క‌నిపించేలా ఎంట్రీలో, ఎగ్జిట్ లో ‘మ‌ద్యం తాగి వాహ‌నం న‌డ‌పొద్దు’ అని రాసిన ఉన్న‌ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఇక, పార్కింగ్ ఏరియాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. ఇక‌ ప్ర‌ధానంగా తీసుకోవాల్సిన మ‌రో సూచ‌న కూడాచేశారు.

తాగినవారు వాహ‌నాలు న‌డ‌ప‌కుండా చూడాల‌ని సీపీ అన్నారు. వారికి డ్రైవ‌ర్ల‌ను ఏర్పాటు చేసి, సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లేలా చూడాల‌న్నారు. ఎవ‌రైనా మాట విన‌క‌పోతే 100 డ‌య‌ల్ చేయాల‌ని సూచించారు. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు మీ వంతు బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు.
Tags:    

Similar News