మోడీకి రాహుల్ ద‌మ్ము స‌వాల్‌

Update: 2015-08-13 09:17 GMT
ల‌లిత్‌ మోడీ వ్య‌వ‌హారంపై వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం తుడుచుపెట్టుకుపోయిన విష‌యం తెలిసిందే. ల‌లిత్ వ్య‌వ‌హారంలో కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్ రాజీనామా చేయాల‌ని.. ఆ త‌ర్వాతే స‌భ న‌డుస్తుంద‌ని తేల్చి చెప్పిన కాంగ్రెస్ అదే తీరును ప్ర‌ద‌ర్శించ‌టం తెలిసిందే.

గురువారం.. వ‌ర్షాకాలం స‌మావేశాల ఆఖ‌రి రోజున సైతం కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో స‌భలో గంద‌ర‌గోళం చోటు చేసుకోవ‌టంతో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.
ఈ నేప‌థ్యంలో మాట్లాడిన కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ.. ప్ర‌ధాని మోడీకి స‌వాలు విసిరారు. విదేశాల్లో ఉన్న ల‌లిత్ మోడీని భార‌త్ కు తీసుకురావాల‌ని..ఆ ద‌మ్ము మోడీకి ఉందా? అంటూ తీవ్ర‌స్వ‌రంతో ప్ర‌శ్నించారు. ల‌లిత్ మోడీ అంశంపై మాట్లాడే ధైర్యం లేక‌నే న‌రేంద్ర‌మోడీ పారిపోతున్నారంటూ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేసిన రాహుల్‌.. అధికార‌ప‌క్ష వైఖ‌రికి నిర‌స‌న‌గా స‌భ నుంచి వాకౌట్ చేశారు.

రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేత‌లు.. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న‌కు దిగారు. కాంగ్రెస్ స‌భ్యుల వైఖరిపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న అధికార‌ప‌క్ష నేత‌లు.. ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించాలంటూ పార్ల‌మెంటు విజ‌య్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వ‌ర‌కు ర్యాలీ నిర్వహించారు. ఇందులో.. ఏన్డీయే నేత‌లు పాల్గొన్నారు. అధికార‌.. విప‌క్ష నేత‌లు పోటాపోటీగా ఒకేసారి ర్యాలీల‌కు దిగ‌టంతో ఇంత‌కాలం స‌భ‌లో ఉన్న ఉద్రిక్త‌తే.. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోనూ చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. మ‌రి..రాహుల్ విసిరిన ద‌మ్ము స‌వాల్ కు ప్ర‌ధాని మోడీ బ‌దులిస్తారా?
Tags:    

Similar News