మాట ఇచ్చి నిరాశ పరచిన పవన్ కల్యాణ్!

Update: 2018-02-20 14:25 GMT
పవన్ కల్యాణ్ చాలా విషయాల్లో భోళాగా ఉంటారు. ఆయనను కలవడానికి ఎవరికైనా యాక్సెస్ దొరకడం మాత్రమే కష్టం. ఆయన చుట్టూ ఉండే మేధో సైంధవులందరినీ దాటుకుని, లేదా వారిని మేనేజి చేసుకుని.. ఆయన దాకా వెళ్లగలిగితే మాత్రం.. మీ సమస్యను ఆయన చాలా సావధానంగా వింటారు. సమస్య పట్ల వెంటనే తన స్పందనను కూడా స్పాంటేనియస్ గా తెలియజేస్తారు. మీ సమస్య పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని మాట కూడా ఇస్తారు. మాట వరకు సిన్సియర్ గానే ఇస్తారు. మనసులో పనిచేసే ఉద్దేశం లేకుండా.. పైకి చేస్తా.. మీకు అండగా ఉంటా వంటి మాటలు మాత్రం చెప్పరని ఆయనను బాగా ఎరిగిన వారు అంటారు.

అయితే పవన్ కల్యాణ్ ప్రతి విషయంలోనూ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్ధానం బాధితుల సమస్య పరిష్కరించేస్తా అన్నారు.. అక్కడ పర్యటించారు.. సీఎంను కలిశారు... ఏవో రెండు ప్రకటనలు వచ్చాయి. ఇప్పటికీ సమస్య అలాగే ఉందని ఆయనే చెబుతున్నారు. ఆక్వాపార్క్ ఉద్యమాన్ని ఆయన టేకప్ చేశారు. అక్కడ పర్యటించారు. పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటా అన్నారు. ఆ తర్వాత దానిని గాలికొదిలేశారు. ఇటీవల.. ఆక్వాపార్కు ఉద్యమకారులు తీవ్రవాదులుగా మారుతారేమో అనే భయం తనకు కలిగిందని ఆయన వెల్లడించారు. కానీ వారి తరఫున తన పోరాటం మాత్రం కొనసాగలేదు. మధ్యలోనే కాడి పక్కన పారేశారు.

ఇవి గతించిపోయిన ఉదాహరణలు. తాజాగా కూడా ఆయన అదే తరహాలో మాట తప్పిన మరో వ్యవహారం ఇది. తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి దీక్షలపై ఆదివాసీల దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు కూడా ఏర్పడ్డాయి. కానీ దీక్షలు కొనసాగుతున్నాయి.

వారి ప్రతినిధులు వచ్చి తనను కలిసినప్పుడు.. పవన్ తన మద్దతు ప్రకటించారు. తాను శ్రీకాకుళం జిల్లా వచ్చి పర్యటించి.. మత్స్యకారుల దీక్షను చూసి.. వారి కష్టాలు స్వయంగా తెలుసుకుని.. ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా అన్నారు. తీరా బుధవారం బయల్దేరాల్సి ఉండగా.. అక్కడి ఆదివాసీలనుంచి హెచ్చరికలు వస్తున్నాయని ప్రకటించి.. పవన్ కల్యాణ్ తన యాత్రను రద్దు చేసుకున్నారు. పవన్ వస్తారు.. తమ కష్టాలు వింటారు.. అని ఆశిస్తునన్ మత్స్యకారులకు.. ఎవరో బెదిరించినందుకు ఆయన తన పర్యటన రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ రాక రద్దు కావడంతో నిరాశకు గురయ్యామని వారు అంటున్నారుట.
Tags:    

Similar News