పవన్ నిలదీస్తాడా..? నిరాశపరుస్తాడా..?

Update: 2015-07-06 08:17 GMT
జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సినిమాపై ప్రజలకు ఎన్ని అంచనాలుంటాయో... ఆయన ప్రెస్ మీట్ పైనా ఇప్పుడు అదే స్థాయి అంచనాలుంటున్నాయి. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతో పవన్ ఈ ప్రెస్ మీట్ లో ఏం చెబుతారు.. దేనిపై మాట్లాడుతారు..  ఎవరిని కడిగేస్తారు.. ఎవరిని పొగిడేస్తారు... లేదంటే కర్రవిరగకుండా, పాము చావకుండా నాలుగు నీతి మాటలు చెప్పి మమ అనిపిస్తారా.... అన్న చర్చ సాగుతోంది. ఏపీ, తెలంగాణల్లో పరిణామాలపై మాట్లాడుతానని ఆయన ముందే చెప్పడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారంతా సాయంత్రం ప్రెస్ మీట్ ఉందని తెలియడంతో అలర్టయిపోయారు. అయితే... ఆయన ఎలా స్పందిస్తారు... ఎవరిని ప్రవ్నిస్తారు... అసలు నిలదీస్తారా? లేదంటే ఎప్పటిలా నిరాశపరుస్తారా అన్నది సాయంత్ర తేలిపోనుంది.ఓటుకు నోటు, సెక్షన్‌-8, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన అభిప్రాయాలేంటనేది సాయంత్రం తెలియనుంది.

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య నెలకొన్న పరిణామాలపై పవన్ ఇంతవరకు స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదు. పెద్దమనిషిలా ఇద్దరికీ వర్తించేలా నాలుగు మంచిమాటలు చెప్పి వదిలేశారు.. కానీ, ఎవరిది తప్పో చెబుతూ గట్టిగా గడ్డిపెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ ఇంతవరకు రెండు సార్లు ట్విట్టర్‌లో వ్యాఖ్యల ద్వారా తన మనోభావాలు వెల్లడించినా అవి పూర్తి స్థాయిలో వ్యక్తంచేసిన అభిప్రాయాలు కావు. అందులో ప్రధానాంశం ఓటుకు నోటు కేసు ప్రస్తావనే లేదు. దీంతో ఈ రోజు సాయంత్రం ఆయన దీనిపై స్పందించాలని అంతా ఆశిస్తున్నారు.

 పవన్ తన గత ట్వీట్లతో ఇద్దరు సీఎంలను మందలించినట్లుగా కామెంట్టు చేశారు. పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలని నడిపితే భవిష్యత్తులో అంతర్యుద్ధాలు వస్తాయని ఆయన గతంలో అన్నారు. ప్రతీకార రాజకీయాలు మంచివి కావని... నెల్సన్ మండేలా లాంటివారు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఏమయ్యేదో తెలుసా అని ఇంటర్నేషనల్ రేంజిలో మాట్లాడారే కానీ అసలు విషయంపై డైరెక్టుగా ఏమీ అనలేకపోయారు.  ఆయన రాజకీయ విషయాలపై ట్వీటు చేసి నాలుగు రోజులైన తరువాత ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకొస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.  ఈ రోజు ఆయన బాగా మాట్లాడుతారని.. జనసేన పార్టీ పెట్టినప్పటి పవన్ ను మళ్లీ చూస్తామని ఆయన అభిమానులు చెబుతున్నారు... చూడాలి ఏమవుతుందో.
Tags:    

Similar News