`పాచిపోయిన ల‌డ్డూ`మాట గుర్తుందా ప‌వ‌న్‌?

Update: 2020-05-30 16:30 GMT
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తార‌ని కొంద‌రు అంచ‌నాలు వేసుకుంటే ఈ న‌టుడు మాత్రం కొద్దికాలంగా సైలెంట్ అయిపోయి త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కొత్త విశ్లేష‌ణ‌కు దారి తీస్తున్నాయి. `ల‌డ్డూ` మాట‌‌తో రాజ‌కీయ వేడిని పుట్టించిన ప‌వ‌న్ ఇప్పుడు ఆ మాట‌తోనే ఇర‌కాటంలో ప‌డిపోతున్నారు. ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోదీ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప‌వ‌న్ `భ‌జ‌న‌` ఈ కామెంట్ల‌కు కార‌ణం.

కేంద్రంలో బీజేపీ రెండో ద‌ఫా అధికారంలోకి రావ‌డం, నరేంద్ర‌మోదీ ప్ర‌ధానిగా ఏడాది పాల‌న పూర్తి చేసుకున్న త‌రుణంలో ప‌వ‌న్ ఓ ట్వీట్ చేశారు. మోదీ ఏడాది పాల‌న‌లో అనేక చారిత్ర‌త్మాక నిర్ణ‌యాలు వెలువ‌‌డ్డాయని, భార‌త‌దేశం ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంద‌ని కితాబిచ్చారు. స్వ‌యం స‌మృద్ధి సాధించిన భార‌త‌దేశం 21వ శ‌తాబ్ధంలో మోదీ సార‌థ్యంలో త‌న ఘ‌న‌త‌ను నిల‌బెట్టుకుంటుంద‌ని కొనియాడారు. ఇందులో న‌రేంద్ర‌మోదీని సైతం ట్యాగ్ చేశారు.

న‌రేంద్ర మోదీ ఏడాది పాల‌న‌పై ప‌లు భిన్నాభిప్రాయాలు ఉన్న త‌రుణంలో ప‌వ‌న్ కురిపించిన ఈ ప్ర‌శంస‌ల ప‌రంప‌ర స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకున్న పార్టీలు అనే సంగతి తెలిసిందే. అయితే, దేశం గురించి కీర్తిస్తున్న ప‌వ‌న్ త‌న రాజ‌కీయ నెరుపుతున్న ఏపీ గురించి మాట మాత్ర‌మైన ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌నేదే...అస‌లు ప్ర‌శ్న‌. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తుది దాకా పోరాడుతాన‌న్న ప‌వ‌న్ గ‌త ఏడాది చేసిన ఓ వ్యాఖ్య గుర్తుండే ఉంటుంది. ఏపీకి ప్ర‌త్యేక ‌హోదా బ‌దులు ప్యాకేజీని కేంద్రం ప్ర‌క‌టిస్తే, `పాచిపోయిన ల‌డ్డూ` ఇచ్చార‌ని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య అనేక మందిని ఆక‌ర్షించింది. అలాంటి కామెంట్లు చేసిన ప‌వ‌న్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని హోదా సాధ‌న గురించి చేస్తున్న కృషి ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. హోదా అంశాన్ని వ‌దిలేశారా అనేది కూడా తెలియ‌ని విష‌యం. తెలుసుకోవాల్సిన విష‌యం. వీటితోపాటు ఆ పాచిపోయిన ల‌డ్డే పొత్తు పెట్టుకున్న త‌ర్వాత తియ్య‌ని ల‌డ్డూగా మారిందా? అనేది కూడా ప‌వ‌న్‌కు మాత్ర‌మే తెలిసిన అంశం. జ‌న‌సైనికుల‌కు అంతుబ‌ట్టని అంశం.
Tags:    

Similar News