మా ఆఫీస్‌ లోకి వచ్చి మమ్మల్నే గేటు వద్ద అడ్డుకుంటారా?

Update: 2020-01-20 16:27 GMT
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం కాగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. జనసేనానిని పోలీసు ఉన్నతాధికారులు పార్టీ కార్యాలయం గేటు వద్దనే అడ్డగించారు. ఆయనతో అధికారులు చర్చించారు. పర్యటనకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు సూచించారు. జనసేన కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు.

రాజధాని అంశంపై అమరావతి నెల రోజులకు పైగా అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. పోలీసులు తమపై జులుం ప్రదర్శించారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని అమరావతిలోని ప్రజలను కలుసుకునేందుకు నడుం బిగించారు. తొలుత మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో భేటీ అయ్యారు. అనంతరం రాజధాని ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు.

విషయం తెలిసిన పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం గేటు వద్ద నిలిపివేసి చర్చించారు. ఇద్దరు డీఎస్పీలు, సీఐ, ఎస్సై ఇతర సిబ్బంది కార్యాలయం వద్దకు వచ్చారు. పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారని తెలిసి కార్యాలయం వద్దకు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తన అమరావతి పర్యటనను అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పర్యటనను అడ్డుకొని వివాదం చేయవద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసులు అమానుషంగా రాజధాని ప్రాంత వాసులపై లాఠీ ఛార్జ్ చేశారని మండిపడ్డారు. అసలు మా కార్యాలయంలోకి వచ్చి తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మా పర్యటనను అడ్డుకొని వివాదం చేయవద్దని సూచించారు.


Tags:    

Similar News