ముద్రగడ లేఖతో పవన్ ఇరుకున పడ్డారా... ?

Update: 2021-11-24 02:30 GMT
కాపులకు వంగవీటి రంగా తరువాత అంతటి ఆరాధ్య నాయకుడుగా ముద్రగడ పద్మనాభాన్ని చెప్పాలి. ఆయన నీతి నిజాయతీలకు మారుపేరు. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితమే ముద్రగడ గురించి ఉమ్మడి ఏపీలో జనాలు ఆసక్తిగా చెప్పుకునేవారు. ఆయన పోరాటాలను కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవారు. ఇక ముద్రగడ తొలిసారిగా కాపులకు రిజర్వేషన్లు అంటూ 1993లో పెద్ద ఉద్యమం నడిపారు.

నాడు కాంగ్రెస్ సీఎం విజయభాస్కరరెడ్డిని అలా ఎదుర్కొన్నారు. ఇక 2014 ఎన్నికల తరువాత చంద్రబాబు కాపులకు బీసీ రిజర్వేషన్లు అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దాంతో ఆ హామీ నెరవేర్చమంటూ ముద్రగడ అయిదేళ్ల పాటు చంద్రబాబుని నిద్రపోనీయలేదు. ఆయన వెంటపడ్డారు. ఈ క్రమంలో ముద్రగడ మీద నాటి టీడీపీ సర్కార్ అణచివేత చర్యలు దారుణంగా సాగాయని కాపు సంఘాలు విమర్శిస్తూ ఉంటాయి.

ఇపుడు అదే నిజం అంటూ ముద్రగడ పద్మనాభం ఒక లేఖ విడుదల చేసి చంద్రబాబుని గట్టిగా నిలదీశారు. నన్ను ఒక్కరోజు కాదు పద్నాలుగు రోజుల పాటు ఆసుపత్రి అనే జైలులో పెట్టి నరకం ఏంటో చూపించిన చంద్రబాబు గారూ ఇపుడు మీకు కన్నీళ్ళు రావడమేంటి అంటూ ముద్రగడ బాగానే నిలదీశారు. తన కుటుంబాన్ని కూడా చిత్ర హింసలు పెట్టారని ఆయన వాపోయారు. మేము మీ మాదిరి మనుషులమే కాదా అని నిగ్గదీశారు. సరిగ్గా కరెక్ట్ టైమ్ లో ముద్రగడ బాబుని సంధించిన లేఖాస్త్రంగా దీన్ని పేర్కొంటున్నారు.

తన భార్యకు కుటుంబానికి అవమానం జరిగింది అని చెప్పి జనాల సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకి ఈ సానుభూతి రాకుండా ముద్రగడ లేఖ ఉందని తెలుస్తోంది. అదే టైమ్ లొ వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఏపీలో మరో మారు అధికారంలోకి రావాలని కూడా చంద్రబాబు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే చంద్రబాబు పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది. దాంతో కాపు సామాజికవర్గంలో దేవుడిగా ఉన్న ముద్రగడ చంద్రబాబుని బోనులో దోషిగా పెడుతూ రాసిన లేఖ పవన్ లాంటి వారికి షాక్ లాంటిదే అంటున్నారు.

కాపులు నిజానికి మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా లేరన్నది ఏపీ రాజకీయాలను గమనించిన వారికి అర్ధమవుతాయి. ఎన్టీయార్ 1983లో టీడీపీ పెట్టినపుడు కూడా కాపులు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. ఇక ఏపీ రాజకీయాలలో సామాజిక విభజన పక్కాగా వచ్చాక కాపులు ప్రతీ ఎన్నికల్లో కీలక శక్తిగా మారి సత్తా చాటారు.

అయితే కాపులు ఉమ్మడి ఏపీగా ఉన్నంతవరకూ కాంగ్రెస్ కే మద్దతుగా ఉన్నారు అన్నది పచ్చి నిజం. ఇక 2014లో మాత్రం ఏపీలో అటు జగన్, ఇటు చంద్రబాబు ఉంటే కాపులకు రిజర్వేషన్ హామీ మీదనే వారు చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. 2019లో ఆ మద్దతు కూడా వైసీపీకి, జనసేనకు మళ్ళింది. దాంతోనే దారుణంగా టీడీపీ గోదావరి జిల్లాలలో ఓడింది. నాడు ముద్రగడను టీడీపీ సర్కార్ పెద్దలు అణచివేశారు అన్న ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది.
4

ఈ క్రమంలో కాపులను జనసేన ద్వారా పవన్ ద్వారా ఆకట్టుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ముద్రగడ ఘాటు లేఖ పూర్తి విఘాతమే అంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ముద్రగడ రాసిన లేఖతో ఏకీభవిస్తారనే అంతా అంటున్నారు.

కాపుల కోసం పోరాడిన ఒక నేతకు అంతలా వేధించిన టీడీపీ, చంద్రబాబుకు మద్దతు అంటే జనసేనకు కానీ పవన్ కి కానీ ఇరకాటమే అన్న మాట ఉంది. మొత్తానికి చంద్రబాబు విషయంలో కాపులు ఇంకా మండుతూనే ఉన్నారు అనడానికి ముద్రగడ లేఖ ఒక నిలువెత్తు ఉదాహరణ అని అంటున్నారు. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.




Tags:    

Similar News