చిన్నమ్మ టు సీఎం వరకూ వేటేసిన పన్నీర్

Update: 2017-02-17 16:34 GMT
తమిళనాడు రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ వచ్చేసి.. నిన్నటి పళిని స్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయటంతో కథ మొత్తం పూర్తిఅయిందని అనిపించినా.. అలాంటిదేమీ లేదన్న సంకేతాలు ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామి రేపు(శనివారం) బలనిరూపణ చేస్తున్న వేళ.. పన్నీర్ వర్గం వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ గా ఉన్న మధుసూదనన్ పేరిట.. పార్టీ తాత్కాలిక ప్రదాన కార్యదర్శిగా ఉన్న శశికళ పై మొదలుకొని.. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళని స్వామి.. ఆయన మంత్రివర్గ సహచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు.. దినకరన్ పై వేటు వేసిన పన్నీర్ వర్గం.. మరింత వేగంగా.. హోల్ సేల్ వేటును వేసేశారు.

అయితే.. ఇంతకు ముందే మధుసూదనన్.. పన్నీర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శశికళ వేటు వేశారు. అయితే.. ఆమెకు పార్టీ నుంచి తమను తొలగించే అధికారం లేదని మధుసూదనన్ చెబుతున్నారు. అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనని.. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందని వారు చెబుతున్నారు.

శశికళకు ఉన్న ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామని.. పార్టీ నియమాలు.. ఆదర్శాల్ని ఆమె ఉల్లంఘించినట్లుగా పన్నీర్ అండ్ కో వ్యాఖ్యానించింది. అమ్మకు ఇచ్చిన మాటను తప్పారని.. శశికళపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఓపక్క ఎమ్మెల్యేల్ని బుజ్జగిస్తూ.. రేపొద్దున జరిగే బలనిరూపణ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న పళనిస్వామికి.. పన్నీర్ వర్గం తీసుకున్న నిర్ణయం మరింత మంట పుట్టించేలా ఉందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News