122 ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేసిన పన్నీర్

Update: 2017-02-21 11:18 GMT
అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే చిరాకు పడిపోతుంటారు చాలామంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అమ్మ విధేయుడు పన్నీర్ సెల్వం. చిన్నమ్మకు వ్యతిరేకంగా గళం విప్పిన ఆయన.. సీఎంగా కుర్చీలో కూర్చోకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు. ఇదో విజయంగా భావిస్తే.. సీఎం కుర్చీలో కూర్చోవాలన్న కోరికను తీర్చుకోవటంలో విఫలయ్యారు పన్నీర్. బలపరీక్ష సందర్భంగా ఆయన ఏదో ఒకటి చేస్తారని అనుకున్నా.. అలాంటిదేమీ ఉండదన్న విషయం తన తీరుతో తేల్చేశారు పన్నీర్.

బలనిరూపణలో అమ్మ ఎంపిక చేసి పళనిస్వామి విజయం సాధించిన తర్వాత.. పన్నీర్ పని అయిపోయిందన్న మాట వినిపించింది. అయితే.. అదంత తేలికైన విషయం కాదన్నది పన్నీర్ వేస్తున్న అడుగులు స్పష్టం చేస్తున్నాయి. బలపరీక్షలో తాను ఓడిపోయినా.. చిన్నమ్మ వర్గానికి నిద్ర లేకుండా చేయాలన్న పట్టుదలతో పన్నీర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 122 మంది శశికళ పక్షాన ఉన్న సంగతి తిలిసిందే. వారిలో కొందరిని తన పక్షాన తెచ్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోయిన నేపథ్యంలో ఈసారి సూటిగా టార్గెట్ చేయాలన్నదే పన్నీర్ లక్ష్యమని చెబుతున్నారు. అమ్మ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం... ఆసుపత్రి లో ఉన్న అమ్మకు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పనున్నారు. రోడ్ షోలు.. ర్యాలీలు.. మహాసభలు ఏర్పాటు చేయటం.. అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం ఎన్ని అవినీతి పనులకు పాల్పడిన విషయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. అమ్మ నియోజకవర్గమైన ఆర్కే నగర్ నుంచి కానీ.. చెన్నై నుంచి కానీ ఈ ప్రచారరథం మొదలవుతుందని చెబుతున్నారు. శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించి.. చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. చిన్నమ్మ పక్షాన నిలవటంతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న నేపథ్యంలో.. దాన్ని మరింత పెంచేలా పన్నీర్ వ్యవహరించనున్నారు. మరి.. పన్నీర్ ఐడియాలు ఎంతవరకూ వర్క్ వుట్ అవుతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News