పోలింగ్ వేళ ‘జంపింగ్’ వీడియో ఎవరి పని?

Update: 2020-11-04 06:30 GMT
తెలంగాణలో తాజాగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక జరిగిన తీరు.. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎన్నికలు ఎలా సాగుతాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.  సోషల్ మీడియా ప్రభావం ఎన్నిక మీదా..పోలింగ్ మీదా ఎంత ఉంటుందన్న అంశం ప్రధాన రాజకీయ పార్టీలకు తెలిసి వచ్చేలా చేసింది. ఇప్పటివరకు పోల్ మేనేజ్ మెంట్ గురించి మాట్లాడే చాలామంది.. సోషల్ మీడియాలో పోల్ మేనేజ్ మెంట్ ఎంతలా చేయొచ్చన్న విషయాన్ని దుబ్బాక ఉప ఎన్నిక తెలిసి వచ్చేలా చేసిందని చెప్పాలి.

ఉప ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ సమయాన బయటకు వచ్చిన ఒక ఫేక్ వీడియో రేపిన కలకలం అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి.. టీఆర్ఎస్ లో చేరనున్నారంటూ.. రెండు ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఫేక్ వీడియోల్లో రెండు ప్రధాన టీవీ చానళ్ల లోగోల్ని ప్రదర్శిస్తూ వీటిని రూపొందించటం గమనార్హం. టీవీ 9.. 10 టీవీలకు చెందిన లోగోలను అక్రమంగా వినియోగిస్తూ.. ఆ చానళ్లు ప్రసారం చేసినట్లుగా రూపొందించిన వీడియోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఎన్నికల్లో గెలుపు కోసం ఇంత దారుణానికి తెగబడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లిన తర్వాత కానీ.. ఈ వైరల్ వీడియో గురించి కాంగ్రెస్ కు సమాచారం అందలేదు. పోలింగ్ వేళ.. ఓట్లు తమకు అనుకూలంగా పడుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు సుధాకర్.. ఆయన వర్గీయులు బిజీగా ఉండగా.. తాను పార్టీ మారనున్నానంటూ.. ప్రచారమవుతున్న ఫేక్ వీడియో గురించి తెలిసిన ఆయన షాక్ తిన్నారు.

ఆ వెంటనే అలెర్టు అయిన ఆయన తనను దెబ్బ తీసేందుకు ఇలాంటివి రూపొందించారన్న విషయాన్ని గుర్తించి..డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే చానల్ లోగోలతో రూపొందించిన ఫేక్ వీడియోలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. తాను ఏ పార్టీ మారటం లేదని చెరుకు సుధాకర్ వివరణ ఇచ్చుకున్నప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న మాట వినిపిస్తోంది.

ఉప ఎన్నికను ప్రభావితం చేయటం కోసం.. ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి అసత్య ప్రచారాన్ని బీజేపీ.. టీఆర్ఎస్ పార్టీలు చేసినట్లుగా టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ ప్రారంభం కాగానే.. వ్యూహాత్మకంగా ఇలాంటి ప్రచారాన్ని చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదు చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఉదంతంపై ఎవరు ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాజకీయంగా పలు మాటలు వినిపిస్తున్నా.. అంతిమంగా తప్పు చేసిందెవరు? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే.. పోలీసుల దర్యాఫ్తు తేల్చనుంది.
Tags:    

Similar News