షాకింగ్.. జనేంద్రియంలో 40 ఏళ్లుగా రబ్బర్ రింగ్

Update: 2020-03-23 03:30 GMT
ఓ వృద్ధురాలి జనేంద్రియంలో 40 ఏళ్లుగా ఇరుక్కుపోయి ఉన్న రబ్బర్ స్టాంపును వైద్యులు బయటికి తీయడం సంచలనం రేపుతోంది. ఈ సంచలన శస్త్ర చికిత్స కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగడం విశేషం. తెలంగాణాలోని గద్వాల నియోజకవర్గం కశ్యాపురం గ్రామానికి చెందిన 65 ఏళ్ల మహిళ మూడు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనిక్‌ విభాగం ఏడో యూనిట్‌కు వచ్చింది. ఆమె తనకు తెల్ల మైల, ఎర్ర మైల, కడుపు నొప్పి సహా పలు సమస్యలు ఉన్నట్లు వివరించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు జననేంద్రియంలో రబ్బరుతో చేసిన రింగు లాంటిది ఉన్నట్లు గుర్తించారు. దాన్ని అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసి తీసేయాలని నిర్ణయించారు.

విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆ రబ్బరు రింగును ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే తీసేశారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌వోడీ డాక్టర్‌ బి. ఇందిర ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 40 ఏళ్ల క్రితం ఈ మహిళకు జరిగిన చివరి ప్రసవం సందర్భంగా గర్భాశయం కొంచెం కిందికి జారిందని, ప్రసవం చేసిన మంత్రసాని రబ్బర్‌ రింగును  జననేంద్రియంలో అమర్చిందని తేలింది. గర్భసంచి జారిన వారిలో ఆపరేషన్‌కు ముందు తాత్కాలిక చికిత్సగా రింగ్‌ పిస్సరిని వాడతారని.. తర్వాత దాన్ని తీసేయాల్సి ఉంటుందని.. ఐతే బాధితురాలు సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేదని.. డాక్టరుకూ చూపించుకోలేదని.. అది అది యోని మార్గంలో ఎక్కువ సంవత్సరాలు ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయని, కొన్నిసార్లు క్యాన్సర్‌ సమస్యలు కూడా తలెత్తవచ్చని ఇందిర తెలిపారు. రబ్బరు రింగు తీసేయడంతో బాధితురాలు ఇప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా ఉన్నట్లు ఆమె వివరించారు.
Tags:    

Similar News