చైనా దిగుమతులపై కేంద్ర మంత్రి ఆగ్రహం

Update: 2020-06-26 06:00 GMT
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన చైనాపై భారతదేశమంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతోంది. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. చైనా నుంచి దిగుమతులు చేసుకోవడంలో తప్పు లేదని, కానీ చివరకు చిన్న చిన్న వస్తువులు చేసుకోవడంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం పూజించే వినాయకుడి విగ్రహాలు కూడా ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దేశంలో లేని ముడి సరుకులను వివిధ పరిశ్రమలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నా అదేం తప్పుకాదని తెలిపారు. చైనా దిగుమతులపై గురువారం స్పందించారు.

దేశ స్వావలంబనకు దోహదపడే వస్తువులను, ముడి పదార్ధాలను దిగుమతి చేసుకోవడంలో తప్పులేదని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. దేశంలో ఉత్పత్తి పెంపునకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దోహదపడే వస్తువులను దిగుమతి చేసుకోవడంలో తప్పులేదని తెలిపారు. మట్టితో తయారు చేసిన గణేషుడి ప్రతిమలను కుమ్మరులు, అమ్మకందారుల నుంచి కొనుగోలు చేయాలని చెప్పారు. దేశంలో అందుబాటులో లేని, మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం తప్పు కాదని పేర్కొన్నారు. స్వావలంబన భారతదేశం అంటే దిగుమతులు అస్సలు చేయకూడదని కాదని, పారిశ్రామిక వృద్ధికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన దిగుమతులు చేసుకోవచ్చునని వివరించారు. సబ్బు పెట్టె, ప్లాస్టిక్ వస్తువులు, పూజకు ఉపయోగించే అగరబత్తి వంటివి దిగుమతి చేసుకోవడం స్వావలంబనకు తోడ్పడుతుందా అని ప్రశ్నించారు. ఇలాంటి ఉత్పత్తులను భారతీయ సంస్థలు సూక్ష్మ, చిన్న తరహా ఎంటర్‌ప్రైజెస్ స్థానికంగా తయారు చేసినప్పుడు మాత్రమే దేశ స్వావలంబన సాధ్యపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఉత్పత్తి ని ప్రోత్సహించడం తో పాటు ఉద్యోగ అవకాశాలు ఇస్తాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు, వృద్ధి లాంటి ప్రయోజనాలు తీసుకు రాలేని దిగుమతులు ఆత్మనిర్భర్ భారత్‌ కు, భారత ఆర్థిక వ్యవస్థ కు సహాయ పడవని చెప్పారు.
Tags:    

Similar News