వైసీపీలో ఈయన కీలకం అవుతారా ?
ఇక బీసీ నేతగా సబ్జెక్టు మీద పట్టు ఉన్న వారిగా ఉత్తరాంధ్రా జిల్లాలో మరో సీనియర్ నేత ఉన్నారు. ఆయన కూడా మాజీ మంత్రిగా ఉన్నారు.;
వైసీపీకి మాస్ లీడర్స్ అవసరం గట్టిగా పడుతోంది. ప్రజలలో ఉంటూ అధికార కూటమిని ఇరకాటంలో పెట్టే నాయకత్వం అవసరం ఇంక ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఇక రీజనల్ వారీగా చూస్తే వైసీపీకి రాయలసీమలో బలమైన నేతలు ఉన్నారు. అయితే వారిలో చాలా మంది ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు. కొందరు ఇపుడిపుడే బయటకు వస్తున్నారు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో చూస్తే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వారి వల్ల కొంత లోటు తీరుతోంది కానీ ఇంకా బలమైన గొంతు వినిపించాల్సి ఉంది. కోస్తాలో అయితే అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని వంటి వారు ఉన్నారు. గోదావరి జిల్లాలో ఇపుడిపుడే పార్టీ పుంజుకుంటోంది.
ఉత్తరాంధ్రాలో అయితే :
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో వైసీపీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. అయితే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాదిరిగా జిల్లాలకు జిల్లాలను శాసించే నేతలు మాత్రం కావాల్సి ఉంది. ఇదంతా ఎందుకు అంటే బొత్స ఇపుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన మీద పెద్దగా ఒత్తిడి పెట్టకూడదు అని అటు కుటుంబం కోరుకుంటోంది. దానిని కచ్చితంగా పార్టీ అధినాయకత్వం ఆమోదిస్తుంది అని అంటున్నారు. ఈ క్రమంలో బొత్స మాదిరిగా పార్టీని ఉమ్మడి మూడు జిల్లాలలో ముందుకు తీసుకుని వెళ్ళే నాయకత్వం అవసరం ఉందని అంటున్నారు.
ఆయన గురించి ఆలోచన :
ఇక బీసీ నేతగా సబ్జెక్టు మీద పట్టు ఉన్న వారిగా ఉత్తరాంధ్రా జిల్లాలో మరో సీనియర్ నేత ఉన్నారు. ఆయన కూడా మాజీ మంత్రిగా ఉన్నారు. ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి అసెంబ్లీకి వెళ్ళి ఉన్నారు. ఆయనే ధర్మాన ప్రసాదరావు. ఇపుడు ఆయన పేరు అధినాయకత్వం పరిశీలిస్తోంది అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యంతో పాటుగా సబ్జెక్ట్ తో కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే నైజం ఉన్న ధర్మానకు చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు.
పార్టీలో దూకుడుగా :
ధర్మాన ప్రసాదరావుకు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. జిల్లా మొత్తం మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే ప్రత్యర్ధుల వ్యూహాలకు ఎత్తులకు పై ఎత్తు వేసే నేపుణ్యం ఉంది. ఆయన అనుచరులుగా చెప్పుకునే వారు విశాఖ జిల్లాలో కూడా ఉన్నారు. అయితే ధర్మాన ఎన్నడూ తన జిల్లాను దాటి బయటకు వచ్చింది లేదు. ఆయన తన పరిధి పరిమితులకు లోబడే రాజకీయాలు చేశారు. ఆయన ప్రెస్ మీట్స్ కూడా అన్నీ శ్రీకాకుళంలోనే పెడుతూ ఉంటారు. అయితే ధర్మాన ఇపుడు జిల్లాను దాటి ముందుకు రావాల్సి ఉందని అంటున్నారు. అంతే కాదు ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు దూకుడుగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
కీలక పదవిలో :
హైకమాండ్ అయితే కీలక పదవిలో ఎవరినైనా ఉంచి ఉత్తరాంధ్రాలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. దాంతో ధర్మానకు కీలకమైన బాధ్యతలు పదవి అప్పగిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక ధర్మాన విషయం తీసుకుంటే తన కుమారుడిని వారసుడిగా చేసి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని అంటున్నారు. అయితే అధినాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఎస్ అని చెబుతారు అని కూడా అంటున్నారు. మొత్తానికి బొత్స ఒకింత తగ్గి విశ్రాంతిని కోరుకుంటున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రాలో సీనియర్ నేతల మీద పార్టీ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. అందులో ముందు వరసలో ధర్మాన ప్రసాదరావు ఉన్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.