వైజాగ్ రాజధాని అయితే పెద్ద ఖర్చవసరం లేదు

Update: 2020-12-11 05:52 GMT
మూడు రాజధానులపై హైకోర్టులో ప్రభుత్వం తరపున లాయర్లు చాలా బలంగా వాదిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అనేక కేసులు కోర్టులో దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా పిటీషనర్ల తరపు లాయర్ల వాదన అయిపోయింది. గడచిన మూడు రోజులుగా ప్రభుత్వం తరపున లాయర్లు తమ వాదనలను వినిపిస్తున్నారు.

ఇందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం తన వాదనలు వినిపిస్తు ఒక్క అమరావతి రాజధానిపైనే  లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్దితి లేదన్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల నుండి వస్తున్న ఆదాయాన్ని కేవలం ఒక్క అమారవతి మీద మాత్రమే ఖర్చు చేసేందుకు ప్రస్తుత  ప్రభుత్వం సిద్దంగా లేదన్నారు. పైగా ఇన్ సైడర్ ట్రేడింగ్ రూపంలో గత ప్రభుత్వంలోని పెద్దలు, కీలక వ్యక్తులు భారీ ఎత్తున భూకుంభకోణానికి పాల్పడిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. తమ  భూముల విలువలు పడిపోతాయన్న టెన్షన్ తోనే చాలామందితో కేసులు వేయించినట్లు వివరించారు.

ఇదే సమయంలో బాగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం నగరానికి పరిపాలనా రాజధానిని తరలించేందుకు పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదన్న విషయాన్ని ఏజీ గుర్తుచేశారు. చాలా తక్కువ ఖర్చుతోనే మంచి రాజధానిగా రూపొందించవచ్చన్న ఉద్దేశ్యంతోనే ప్రస్తుత ప్రభుత్వం వైజాగ్ సిటీని రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని చూసినా అమరావతిపై లక్ష కోట్లరూపాయలు పెట్టేంత పరిస్దితి లేదని కూడా శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పలనా వికేంద్రీకరణ వల్లే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నది తమ ప్రభుత్వం భావించినట్లు తెలిపారు. కాబట్టి మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లలో రాజకీయ దురుద్దేశ్యాలను గుర్తించాలని త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. వెంటనే మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటు అడ్వకేట్ జనరల్ తన వాదనను ముగించారు. మరి పూర్తి వాదనలు విన్న తర్వాత  త్రిసభ్య ధర్మాసనం ఏమంటుందో చూడాలి.
Tags:    

Similar News