ప్రత్యేక హోదా కావాలని బాబు అడగలేదంట

Update: 2016-05-13 17:26 GMT
ఏపీకి ప్రత్యేక హోదా అంశం కొత్త మలుపు తిరిగినట్లైంది. విభజన నేపథ్యంలో ఏపీకి ఎంతో మేలు చేసే అవకాశం ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నా.. దానిపై కేంద్రంలోని మోడీ సర్కారు సానుకూలంగా లేని విషయం తెలిసిందే. మోడీ సర్కారు తీరుపై ఏపీలోని సీమాంధ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న వేళ.. తమపై వెల్లువెత్తుతున్న విమర్శల్ని తెలుగుదేశం పార్టీ వైపు డైవర్ట్ చేసే పనిలో బీజేపీ పడినట్లుగా కనిపిస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన బీజేపీ నేతల మీద తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయిలో విరుచుకుపడింది తెలిసిందే. మిత్రులన్న విషయాన్ని కూడా చూసుకోకుండా తమ మీద చెలరేగిపోతున్న ఏపీ అధికారపక్షం మీద గుర్రుగా ఉన్న కమలనాథులు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉండటం తెలిసిందే. తాజాగా.. ఏపీ అధికారపక్షంపై తమ దాడిని షురూ చేసినట్లుగా కనిపిస్తోంది.

ఏపీలో జరుగుతున్న బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి హాజరైన బీజేపీ ఏపీ వ్యవహారాల బాధ్యులు సిద్దార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సిద్దార్థ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉండటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడగలేదన్నట్లుగా  ఆయన చెప్పటం గమనార్హం. ‘‘మా సంకీర్ణ ప్రభుత్వ నేతగా చంద్రబాబు ఏం అడిగారో మీకు తెలుసు కదా? చట్టంలో ఉన్నదాన్నే అమలు చేయాలని చంద్రబాబు చెప్పారు’’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి మీద ఆయన విమర్శనాస్త్రాల్ని గురి పెట్టటం గమనార్హం. విభజన చట్టంలోని అంశాలన్నింటిని తాము అమలు చేస్తున్నామని.. తాము చట్టంలోని అంశాల్ని ఎక్కడ ఉల్లంఘిస్తున్నామో చెప్పాలంటూ ఎప్పుడూ చెప్పే మాటల్నే సిద్దార్థ్ చెప్పుకురావటం గమనార్హం.
Tags:    

Similar News