'ఏపీ'లో నైట్ కర్ప్యూ మరోసారి పొడిగింపు..!

Update: 2021-07-30 06:13 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటూ రాత్రివేళ కర్ఫ్యూను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో వచ్చే నెల ఆగస్టు 14 వరకు నైట్ కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

ఇకపోతే, అందరూ కరోనా వైరస్ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జరిమానా విధించనున్నారు. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేయనున్నారు. అలాగే 2-3 రోజులపాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం వెల్లడించింది.

దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబరును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మరోవైపు, మాస్కులు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్‌ ఐ లు సహా ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేది.రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కానీ ఆ జిల్లాల్లో కరోనా అదుపులోకి రావడం లేదు.


Tags:    

Similar News