ఇద్దరు చంద్రులు... రాజకీయ పవనం ఎటు వైపు...?

Update: 2022-10-08 23:30 GMT
ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్టులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీలో పేరుకు చాలా పార్టీలు ఉన్నాయి. నిజానికి అతి పెద్ద పార్టీలుగా వైసీపీ టీడీపీ ఉంటే జనసేన కూడా బలంగా ఎదుగుతోంది. కానీ మిగిలిన పార్టీలు కూడా పొత్తులతోనో మరో దానితోనో ముందుకు రావడం వల్ల రాజకీయం మొత్తం రసకందాయంలో పడుతోంది. ఏపీలో చూస్తే బీజేపీ ఒక జాతీయ పార్టీ. కానీ నోటా కంటే తక్కువ సీట్లు ఆ పార్టీకి వచ్చాయి.

అయినా సరే ఆ పార్టీ ఏపీలో ఆర్భాటం మామూలుగా చేయడంలేదు. రేపు ఎన్నికలు పెడితే వైసీపీని కూలదోసి తామే అధికారంలోకి వస్తామని బీరాలు పలికే వారు బీజేపీలో చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉంటే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది కానీ మనసులు కలవడంలేదు అనే అంటున్నారు. గత ఏడాది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల తరువాత ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు.

ఇక టీడీపీతో పవన్ కళ్యాణ్ ప్రయాణం అని అంతా అనుకుంటున్న సమయం. దానికి అనువుగా టీడీపీలోనే ఏర్పాట్లు చేసుకుంటూ సీట్ల సర్దుబాటు దిశగా ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తూ వస్తున్నారని అంటున్నారు. అయితే టీడీపీ జనసేన బంధం దాదాపుగా ఖాయమైపోయిన నేపధ్యం అని అనుకుంటున్న క్రమంలో ఇపుడు బీయారెస్ ఏపీలో ఎంట్రీ ఇస్తోంది. ఈ పార్టీ కూడా ఏపీలో ఎదగాలని చూస్తోంది.

అలాగే జాతీయ పార్టీగా నిలదొక్కుకోవాలంటే ఏపీలో కనీసంగా ఓట్లూ  సీట్లూ తెచ్చుకోవాలి. సాటి తెలుగు రాష్ట్రం, అక్కడ ఏమీ రాకపోతే బీయారేస్ కి మిగతా చోట్ల పరువు పోతుంది. దాంతో ఎత్తుల మీద ఎత్తులు బీయారెస్ వేస్తోంది అని అంటున్నారు. ఏపీలో బలమైన వైసీపీ టీడీపీలతో ఎటూ పొత్తు కుదిరే సీన్ లేదు. దాంతో జనసేనను దువ్వుతోంది అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే టీయారెస్ అధినాయకత్వాన్ని వారి పాలనని  చాలా సార్లు పొగిడారు.

ఆయన విభజన టైం లో టీయారెస్ ని విమర్శిస్తూ  ఏమి మాట్లాడారో కానీ ఆ తరువాత అయితే  కేసీయార్ పాలనను పొగుడుతూ చాలానే మారిపోయారు అనే అంటారు. ఇపుడు ఆ పాజిటివ్ నెస్ తోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయని అంటున్నారు. దీని వల్ల ఉభయ పార్టీలకు కలిగే లాభం ఏంటి అంటే టీయారెస్ కి ఏపీలో సీఎం సీటు అవసరం లేదు, కానీ ఓట్ల షేర్ పెరిగి ఒకటి రెండు ఎంపీ సీట్లు దక్కినా ఫుల్ హ్యాపీ. అదే పవన్ కి సీఎం కుర్చీ కావాలి. మరి ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి కేసీయార్ రాజకీయ చాణక్యం పనిచేస్తుంది అని అంటున్నారు.

ఇప్పటికే ధనిక పార్టీగా ముద్రపడిన టీయారెస్ కి వ్యూహాలకు రాజకీయ అధికారానికి కొదవ లేదు. పైగా సీమాంధ్ర వాసులు హైదరాబాద్ లో సెటిల్ అయిన వారు బీయారెస్ కి ఓటు వేస్తారని. అలా వేయించుకోగలమని నమ్ముతోంది. బలమైన నాయకత్వంతో ఏపీలో పొత్తు ఉంటే దున్నేయగలమని కూడా భావిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య మెగాస్టార్ పవన్ సీఎం కావాలని కోరుకోవడం వెనక కూడా ఈ తరహా ఆలోచనలు ఉండే చేశారా అన్న చర్చ వస్తోందిట. అంటే మెగా బ్రదర్స్ ని ముందు పెట్టుకుని టీయారెస్ రాజకీయం ఏపీలో స్టార్ట్ చేస్తుందా అన్నదే చర్చ. అయితే ఇది ఎంతవరకూ వర్కౌట్ అవుతుంది అన్నదే చూడాలని అంటున్నారు.

ఎందుచేతనంటే ఏపీ జనాలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారు కేసీయార్. పైగా ఏపీ ఈ రోజు అప్పుల కుప్పగా ఏమీ అభివృద్ధి లేకుండా పోవడానికి కేసీయార్ కారణం. ఈ రోజుకీ నీటి పంచాయతీలతో పాటు అనేక తగాదాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాంటి  పార్టీతో పొత్తు అంటే పవన్ రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా ఇబ్బందుల్లో  పెట్టుకున్నట్లే అంటున్నారు.

అదే విధంగా చూస్తే ఏపీలో బీయారెస్ కి చోటు లేదని నెటిజన్లు అంటున్నారు. కేవలం పదవుల కోసమో మరే ప్రలోభాల కోసమో ఆ పార్టీతో చేతులు కలిపితే వారు కూడా కచ్చితంగా ఏపీ ద్రోహులే అవుతారని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఈ రోజుకు కేసీయార్ వంటి సంపన్న పార్టీ  అండ ఉంటుందనో మరో కారణంతోనే జత కలిస్తే అది రాజకీయ ఆత్మహత్య తప్ప మరేమీ కాదని కూడా అంటున్నారు.

ఇక తెలంగాణా రాజకీయాల్లో ఏపీకి ఎలాంటి చోటు లేదని, ఆంధ్రా వాళ్ళ పెత్తనం మాకేంటి అని ఇప్పటిదాకా కేసీయార్ రెచ్చగొడుతూ వస్తున్నారు. ఇపుడు ఆయనకు కూడా అదే గుణపాఠం ఏపీ జనాలు తిరిగి అప్పచెబుతారు అనే అంటున్నారు. కేసీయార్ తో జట్టు కట్టే వారి రాజకీయా కూశాలు కూడా ఏపీలో కదిలిపోతాయని అంటున్నారు. అందువల్ల జనసేన ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా రాంగ్ స్టెప్ అవుతుంది అని అంటున్నారు.

ఇక ఏపీలో వైసీపీని గద్దె దించడనైకి ఓట్ల చీలికకు ఆస్కారం ఇవ్వనని ఒకటికి పదిసార్లు పవన్ చెప్పారు. ఇపుడు ఆయన సొంతంగా పోటీ చేసినా లేక బీయారెస్ తో పొత్తు పెట్టుకున్నా భారీగా ఓట్లు చీలి చివరికి వైసీపీకే లాభం అవుతుంది అని కూడా విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. చూడాలి మరి ఇపుడు ఒక వైపు టీడీపీ చంద్రుడు మరో వైపు బీయారెస్ చంద్రుడు ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్యలో రాజకీయ పవనాలు ఎటు వైపు వీస్తాయో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News