వైఎస్సార్ మీద ప్రయోగించిన అస్త్రమే జగన్ మీద...?

Update: 2022-12-28 06:30 GMT
రాజకీయాల్లో కూడా భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పే విషయాలు చాలా జరుగుతాయి. అన్ని పార్టీలు తిరిగిన వారు మళ్లీ సొంత పార్టీలోనే తేలుతారు. అలాగే అన్ని ఎత్తులు అయిపోయాక మళ్లీ పాతకాలం నాటి వ్యూహాలనే కొత్తగా అమలు చేయడం కూడా అనివార్యమే. ఇదంతా ఎందుకంటే మహా కూటమి అంటూ ఉమ్మడి ఏపీలో 2009 ఎన్నికల వేళ కట్టిన చరిత్ర ఒకటి ఉంది.

ఈ ఉమ్మడి కూటమిలో అన్ని పార్టీలు కిక్కిరిసి మరీ చేరిపోయాయి. టీయారెస్ వామపక్షాలను పెట్టుకుని టీడీపీ ఆనాడు ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ రెండవసారి సీఎం కాకుండా అతి పెద్ద ప్లాన్ వేసింది. అయితే మహా కూటమి నాడు సక్సెస్ కాలేదు. కాకపోతే ఓట్లూ సీట్లు తెలుగుదేశానికి బాగా పెరిగాయి.

ఇక 2014లో విభజన ఏపీలో బీజేపీ జనసేన మద్దతుతో మరోమారు అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ 2019లో ఒంటరి పోరు చేసి ఓడిపోయింది. ఇపుడు మహా కూటమి ప్రయోగాన్ని మళ్లీ ముందుకు తెస్తోంది. చిత్రంగా నాడు వైఎస్సార్ మీద ప్రయోగించిన అస్త్రమే ఇపుడు ఆయన తనయుడు జగన్ మీదకు వదులుతున్నారు చంద్రబాబు. వైఎస్సార్ ని రెండవమారు సీఎం కాకుండా అడ్డుకోవాలని చూసినా సాధ్యపడలేదు. మరి ఇపుడు జగన్ రెండవసారి సీఎం కాకూడదు అంటూ టీడీపీ వేస్తున్న ఎత్తులు పారతాయా అన్నది చూడాలని అంటున్నారు.

విజయవాడలో అఖిలపక్షం సమావేశాన్ని తెలుగుదేశం నాయకత్వాన నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు నాయకత్వం వహించారు. ఈ సమావేశం అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెబుతున్నా దీని వెనక 2024 ఎన్నికల రాజకీయ వ్యూహాలే ఉన్నాయని అంతా అంటున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జై భీం భారత్ పార్టీ, జనసేన హాజరయ్యాయి.

ఈ సమావేశంలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏపీకి ముఖ్యంగా ప్రజస్వామానికి ప్రమాదకరమని అఖిలపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లో జగన్ కి రెండవ చాన్స్ ఇవ్వకూడదని, దానికి అంతా ఒక్కటిగా నిలిచి పోరాడాలని నిర్ణయించారు. జగన్ కి ఒక్క చాన్స్ ఇస్తే వ్యవస్థ అన్నీ తన వద్ద పెట్టుకుని నోరెత్తితే అరెస్టులు చేస్తున్నారని, ప్రశ్నించే వారికి గొంతులు నొక్కుతున్నారని మండిపడ్డారు.

ఏపీలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే వైసీపీ అధికారంలోకి రాకూడదు అని అఖిలపక్ష ప్రతినిధులు తీర్మానించారు. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేశ్, కాంగ్రెస్ తరఫున నరసింహారావు, జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్‌ పాల్గొన్నారు. ఇక అజెండా చూస్తే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న అంశం మీద సాగింది.

రాష్టంలో అరాచక పాలన సాగుతోందని, దాన్ని అడ్డుకోవడానికి అంతా ఒక్కటిగా నిలవాలని కూడా అఖిల పక్షం నేతలు నిర్ణయించారు. ఏపీ టూర్ లో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ని కలసి ఏపీలో సాగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలన మీద వినతిపత్రం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇక జనసేన బీజేపీ వంటి మతతత్వ పార్టీతో తన బంధాన్ని తెంచుకుని ప్రజాస్వామ్య శక్తులను బలపరచాలని జై భీం పార్టీ నేత శ్రావణ్ కుమార్ కోరడం విశేషం.

అలాగే వైసీపీని గద్దె దించడానికి ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని కూడా ఈ భేటీ నిర్ణయించడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మహా కూటమికి స్కెచ్ వేశారని అంటున్నారు. ఇందులో బీజేపీ జనసేన చేరితే ఇక కధ సుఖాంతం అయినట్లే అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక్కటీ ఒక వైపు మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ మరో వైపు ఉంటాయన్న మాట. వారూ వీరూ తేడా లేకుండా అందరినీ కలుపుకుని ఏర్పడే మహా కూటమి జగన్ని గద్దే దించుతానంటోంది. మరి 2009 నాటి సీన్ ఏపీలో మళ్లీ ఆవిష్కరించబడుతోంది. రిజల్ట్ అయితే ప్రజల చేతిలో ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News